
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ అటుంచితే, శ్రీమంతుడు సినిమా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకొని ప్రత్యేకత చాటుకుంది. ఊరిన దత్తత తీసుకొని బాగుపరచడమనే ఉన్నతమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా మహేష్‌కు అన్ని వర్గాల నుండి ప్రశంసలతో పాటు గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది.
ఇక ఈ నేపథ్యంలోనే తనకు మరచిపోలేని హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివకు, మహేష్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ప్లాన్ చేశారు. ఆదివారం సాయంత్రం మహేష్, కొరటాల శివకు ఫోన్ చేసి హైద్రాబాద్‌లోని ఆడి షోరూమ్‌కు రావాల్సిందింగా కోరారట. కొరటాల శివ అక్కడకు చేరుకోగానే, మహేష్ ఆడి సంస్థ నుంచి కొత్తగా వచ్చిన ఆడి ఏ 6 కారును గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. మహేష్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు కొరటాల శివ సంతోషంలో మునిగిపోయారు. తనకు శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచించిన మహేష్, ఆడి ఏ 6 మ్యాట్రిక్స్ కారైతే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశానని ఈ సందర్భంగా తెలిపారు.

