
సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టే వారం రానే వచ్చేసింది. ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు తమ హీరోను స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. మహేష్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఆగష్టు 7న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అంతటా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.
ఇక ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిన్న శ్రీమంతుడు తమిళ వర్షన్ ‘సెల్వందన్’ ఆడియోను మహేష్ స్వయంగా పాల్గొని విడుదల చేశారు. చెన్నైలో పెద్ద ఎత్తున జరిగిన ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులు.. కళైపులి థాణు, ధరణి, ఏ.ఎమ్. రత్నం, కె.ఎస్.రవి కుమార్ తదితరులు అతిథులుగా విచ్చేసి, మహేష్ నటనను కొనియాడారు. ఇక ఇదే సందర్భంగా మహేష్ తమిళంలో మాట్లాడి అందరినీ అలరించారు. తాను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అని, మొదటి సారి తమిళంలో ఒక సభలో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తమిళ ప్రేక్షకులు, ఈ సినిమానూ అదే స్థాయిలో ఆదరిస్తారన్న నమ్మకాన్ని మహేష్ వ్యక్తం చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటుడు జగపతి బాబు, సినిమాటోగ్రాఫ్అర్ మధిలతో పాటు శ్రీమంతుడు టీమ్ పాల్గొని తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

