‘మా’ ఎన్నిక ఏకగ్రీవమైతే పోటీ నుంచి తప్పుకుంటా – మంచు విష్ణు

Published on Jul 12, 2021 8:17 pm IST

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చాంశనీయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సారి ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు వంటి వారు పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. అయితే తాజాగా మా అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే పోటీలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్‌ బిల్డింగ్‌ను తాను, తన కుటుంబసభ్యులం కలిసి నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.

అసలు మంచు విష్ణు ఏం చెప్పుకొచ్చాడంటే నేను ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో మద్రాసులో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క నడిగర్ సంఘం మాత్రమే ఉండేదని, అయితే మన తెలుగు సినీ నటీనటులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. తెలుగు సినీ నటీనటుల కష్టసుఖాలు తెలిసిన తెలుగువారే అధ్యక్షులుగా ఉంటూ చాలా మంచి పనులు చేశారని అన్నారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని, ఇక్కడ పెద్దలందరూ కలిసి 1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగానే ఉన్నారని, ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబం గానీ వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నామని అన్నారు.

2015లో దాసరి నారాయణ రావు గారు, మురళీ మోహన్ గారు ఇద్దరు కలిసి నన్ను అధ్యక్షుడిగా ఉండమని అడిగితే, ఆరోజు నాన్నగారు అడ్డుపడి ‘ఇప్పుడే ఈ వయసులో ఎందుకు’ అని వద్దని సర్ధి చెప్పారని అన్నారు. ఇంతకు ముందు ఉన్న మురళీ మోహన్ గారు, నాన్న గారు, నాగబాబు గారు, రాజేంద్రప్రసాద్ గారు, శివాజీ గారు ఎన్నో మంచి పనులు చేశారన్, ప్రస్తుతం ఉన్న నరేష్ గారు కూడా కష్టాల్లో ఉన్న ఎంతో మంది తోటి ఆర్టిస్టులకి అండగా నిలబడి వాళ్ళకి ఇన్సూరెన్స్ లు, పెన్షన్స్ వంటివి ఇప్పైంచడమే కాకుండా, తన సొంత డబ్బులు కూడా ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేశారని, ఇలా ప్రతి ఒక్కరు కూడా మా కోసం ఎంతో నిస్వార్ధంగా కృషి చేసారని అన్నారు. మా అసోషియేషన్‌లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావని తాను అనుకుంటున్నానని, మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్ళి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దామని అన్నారు.

ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే మురళీమోహన్ గారు ప్రెసిడెంట్‌గా, నేను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ‘మా’ అసోషియేషన్ బిల్డింగ్‌కి అయ్యే మొత్తం ఖర్చులో 25 శాతం నేను, నా కుటుంబం ఇస్తామని చెప్పానని, 10-12 ఏళ్ళుగా ఆ బిల్డింగ్ కట్టాలని అందరు అంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా జరిగే ప్రతి ‘మా’ ఎలక్షన్స్ అదే ప్రధాన అజెండాగా వినిపిస్తుంది. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చానని ‘మా’ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తానని, నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్‌ని నేను నిర్మిస్తానని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో యూనియన్ మెంబర్‌షిప్‌ ఉన్న వాళ్లే సినిమాల్లో పని చేయాలి, కానీ మెంబర్‌షిప్‌ లేని చాలామంది పనిచేస్తున్నారు, మెంబర్‌షిప్‌ ఉన్నవారికి పని లేదు. కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేద్దాం తప్పులేదు.. కానీ సినిమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు మా మెంబర్ అవ్వాల్సిందేనని మంచు విష్ణు అన్నాడు. మా అసోషియేషన్ మరింత బలపడాలని, ప్రతి ప్రొడక్షన్ హౌస్‌కి ‘మా’కి మధ్య మంచి రిలేషన్ ఉండాలని, దేశంలో ఉన్న అన్ని సినీ అసోసియేషన్స్ తో మన ‘మా’ గట్టి సంబంధాలు కలిగి ఉండాలని అన్నారు.

నేను ఇప్పటికీ నమ్మేది ఒక్కటే.. ఇండస్ట్రీ పెద్దలంతా కూర్చుని ‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటానని, ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నేను సిద్ధమని అన్నారు. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ల సలహాలు పాటిస్తాం.. మా యంగర్ జనరేషన్‌ని ఆశీర్వదించి.. ‘మా’ ప్రెసిడెంట్‌గా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్త్న్నట్టు మంచు విష్ణు అన్నారు.

సంబంధిత సమాచారం :