
మణిరత్నం.. తన మ్యాజిక్ సినిమాలతో దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మాస్టర్ ఫిల్మ్‌మేకర్. గత కొంతకాలంగా తనదైన సినిమా తీయలేకపోయిన ఆయన, ‘ఓకే బంగారం’తో ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అనిపించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే ఆయన కొత్త సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టేశారు. తమిళ స్టార్ కార్తీ, మళయాల స్టార్ దుల్కర్ సల్మాన్‌లతో మణిరత్నం ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే!
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణి రత్నం అన్నీ ప్లాన్డ్గా పూర్తి చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం మేరకు మణిరత్నం ఈ సినిమాను 90 రోజుల్లో పూర్తి చేసేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రతిదీ డీటైల్‌గా చెప్పాలన్న ఆలోచనలో మణిరత్నం తన సినిమాలకు చాలా టైం తీసుకుంటారన్న విషయం తెలిసిందే. అలాంటి మణిరత్నం తన కొత్త సినిమాను 90 రోజుల్లో పూర్తి చేయాలని పక్కా ప్లాన్ చేసుకోవడం విశేషంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. ఏ.ఆర్.రహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

