చెర్రీ సినిమాలో నటించడం లేదన్న మనోజ్

చెర్రీ సినిమాలో నటించడం లేదన్న మనోజ్

Published on Dec 7, 2015 4:30 PM IST

Manchu-Manoj
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పినప్పట్నుంచే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించనున్నారన్న విషయం ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చింది. తమిళంలో నాటితరం స్టార్ హీరో అరవింద్ స్వామి ఈ పాత్రలో నటించి అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన స్థానంలో తెలుగులో ఎవరు నటిస్తారనే దానిపై ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.

తాజాగా ఈ జాబితాలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోన్న మంచు మనోజ్ పేరు కూడా వినిపించింది. రామ్ చరణ్ సినిమాలో మనోజ్ విలన్‌గా నటించనున్నాడనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే ఈ విషయమై మనోజ్ ఓ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తోన్న వార్తలను తప్పుడు కథనాలుగా ఆయన పేర్కొన్నారు. ఇకపోతే తెలుగు వర్షన్‌లో కూడా అరవింద్ స్వామి నటిస్తేనే బాగుంటుందన్న ఆలోచనలో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆయనను తెలుగులోనూ నటింపజేసేలా రామ్ చరణ్ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అరవింద్ స్వామి కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. అల్లు అరవింద్-ఎన్.వి.ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు