
ఇటీవల విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ లియో. మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది లియో. ఇక ఈ మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించారు ప్రముఖ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్. విషయం ఏమిటంటే, ఈ మూవీలో నటించిన హీరోయిన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ పై ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలు, మీడియా, ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
కాగా ఈ విషయమై తాజాగా ప్రెస్ మీట్ లో మన్సూర్ ఆలీ ఖాన్ మాట్లాడుతూ, తాను ఎవరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నడిగర్ సంఘం తన సస్పెన్షన్‌ను హడావుడిగా పరిగణలోకి తీసుకుందని, చర్య తీసుకునే ముందు సమస్యపై వారు తనని విచారించలేదని విమర్శించారు. తమ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సంఘం వారికి మన్సూర్ నాలుగు గంటల అల్టిమేటం ఇచ్చారు. అలాగే మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు మన్సూర్ అలీఖాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. మరి ఈ ఘటన పై నడిగర్ సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.