సమీక్ష : మార్షల్ – కొన్ని చోట్ల ఆకట్టుకుంటాడు !

Published on Sep 13, 2019 11:20 pm IST

విడుదల తేదీ : సెప్టెంబరు 13, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : అభయ్, మేఘా చౌదరి, శ్రీకాంత్, సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్, తదితరులు.

దర్శకత్వం : జై రాజసింగ్

నిర్మాత‌లు : అభయ్ అడకా

సంగీతం : యాదగిరి వరికుప్పల

సినిమాటోగ్రఫర్ : స్వామి ఆర్ యమ్

స్క్రీన్ ప్లే : జై రాజసింగ్

జై రాజాసింగ్ దర్శకత్వంలో అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మించారు. ‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి రీ రికార్డింగ్ అందించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

శివాజీ (శ్రీ కాంత్) ఒక సూపర్ స్టార్. శివాజీకి ఉన్న లక్షల మంది ఫ్యాన్స్ లో అభి (అభయ్) ఒకడు. శివాజీతో కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలని ఆశ పడినా కుదరదు. అయితే చివరికి తన అభిమాన కథానాయకుడినే అభి టార్గెట్ చేయాల్సి వస్తోంది. అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అభితో మేఘా (మేఘా చౌదరి ) ప్రేమలో పడుతుంది. మేఘా తన ప్రేమ కోసం ఏం చేసింది. ఇంతలో అభి జీవితంలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి? వాటి వల్ల అభి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు అభి సూపర్ స్టార్ శివాజీని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇంతకీ శివాజీ నిజ స్వరూపం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే మెడికల్ సిస్టమ్ కి సంబంధించిన సీన్స్ అండ్ మార్షల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ చివరిగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. ఇక శ్రీకాంత్, అభయ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. సినిమాలో శివాజీ అనే కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ చక్కని నటనను కనబరిచాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో కొన్ని మెయిన్ సన్నివేశాల్లో కూడా తన నటనతో వాటిని ఇంకా ఎలివేట్ చేస్తూ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అభయ్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా అభయ్ నటన బాగుంది. అలాగే డాన్స్ అండ్ ఫైట్స్ తో కూడా అభయ్ మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన మేఘా చౌదరి గ్లామర్ పరంగానే కాకుండా తన నటనతోనూ మెప్పించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక దర్శకుడు మెడికల్ సిస్టమ్ ను డీల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

మెడికల్ కి సంబంధించి ఆసక్తికరమైన పాయింట్ రాసుకున్న దర్శకుడు దానికి తగ్గ కథాకథనాలతో సినిమాని మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు. స్లో నరేషన్ తో ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో ఫస్ట్ హాఫ్ సాగింది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకున్నా.. ఆ సీన్ అవ్వాల్సిన స్థాయిలో సరిగ్గా ఎలివేట్ కాలేదు. పైగా అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని కూడా నీరుగార్చారు. కానీ అక్కడక్కడ వచ్చే బలమైన కంటెంట్ తో మళ్ళీ సినిమా ట్రాక్ ఎక్కుతుంది అనుకునే లోపే.. విషయం లేని సీన్స్ వచ్చి పడతాయి.

మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ కంటే కూడా.. పండని కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సన్నివేశాలు అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా బాగా విసుగు తెప్పిస్తోంది. ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.

 

సాంకేతిక వర్గం :

 

మెడికల్ మాఫియా నేపథ్యంలో కథను ఎంచుకున్న దర్శకుడిని అభినదించాల్సిందే. ఆయన ఐడియాలు బాగున్నాయి కానీ వాటికీ ఇంట్రస్టింగ్ అంశాలు జోడిస్తేనే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని ఆయన వదిలేసారు. స్వామి ఆర్ యమ్ అందించిన సినిమాటోగ్రపీ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. యాదగిరి వరికుప్పల అందించిన సంగీతం పర్వాలేదు.

‘కె జి ఎఫ్’ మ్యూజిక్ ఫేమ్ రవి బసురి అందించిన రీ రికార్డింగ్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తోంది. ఎడిటింగ్ బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

కొత్త పాయింట్‌ తో వైవిద్యభరితమైన చిత్రంగా ఈ మార్షల్ లో మంచి మెసేజ్ ఉంది. అలాగే వైద్య వ్యవస్థలోని చీకటి కోణాల్ని ఈ చిత్రం బాగా చూపెట్టింది. ముఖ్యంగా శ్రీకాంత్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే మార్షల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. అయితే కథాకథనాలు ఆసక్తికరంగా లేకపోవడం, కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ ఇంట్రస్ట్ గా సాగకపోవడం, అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click here for English review

సంబంధిత సమాచారం :

More