ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ‘త్రినాధ్ వెలిశిల’ – నా పర్సనల్ లైఫ్ కూడా.. నాకు సినిమానే !

Published on Aug 2, 2020 4:32 pm IST

ఇటీవల ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5లో విడుదలైన ‘మేక సూరి’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకాదరణ బాగుంది. కాగా ఈ సినిమాని తీసిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘త్రినాధ్ వెలిశిల’ను చిత్రానికి సంబంధించిన అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీకోసం…

 

ముందుగా, మీ నేపథ్యం గురించి చెప్పండి?

 

మాది విజయవాడ, చిన్నప్పటి నుండే క్రియేటివిటీ పట్ల ఆసక్తి ఉండేది. స్కూల్ డేస్ లో కూడా అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనేవాడిని. ఫ్రెండ్స్ కూడా నేను చెప్పే కథలు చాలా బాగున్నాయి అనేవారు. అలా సినిమా పై ఆసక్తి రావడంతో, పరిశ్రమలోకి వచ్చాను. అనేక సినిమాలకు రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది. మేక సూరి సినిమాతో దర్శకుడిగా మారాను.

 

మేక సూరి మూవీ ప్రత్యేకత ఏమిటీ?

 

సాధారణంగా ‘రా కంటెంట్’ మూవీస్ లో హింస, గొడవలు వంటివి మాత్రమే హైలైట్ చేస్తూ చెబుతారు. కానీ, మేక సూరి మూవీలో ‘రా కంటెంట్’ తీసుకొని ఎమోషన్స్ చెప్పడం అనేది కొత్త అంశం. అలాగే సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక
అందరూ సినిమాలోని మెయిన్ అంశాల పై బాగా స్పందిస్తున్నారు. నాకు పర్సనల్ గా ఫోన్ చేసి సినిమా పై వారికి కలిగిన అనుభూతిని పంచుకుంటున్నారు. ప్రేక్షకుల నుండి మంచి ప్రశంశలను అందుకోవడం ఆనందంగా ఉంది.

 

మేక సూరి మూవీ చేసే అవకాశం ఎలా వచ్చింది?

 

ఈ సినిమా నిర్మాణంలో నేను అలాగే నా మిత్రుడు పార్థు సైని కూడా బాగస్వాములనే చెప్పాలి. అయితే శింబ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత కార్తీక్ కంచర్లగారి సహాయంతోనే ఈ మూవీని చేయడం జరిగింది.

 

మంచి కథ రాసుకున్నారు. మరి సినిమాలో అందర్ని కొత్తవారినే తీసుకోవడం రిస్క్ అనిపించలేదా ?

 

నేను నా కథను నమ్మాను. మన కథలో గుడ్ కంటెంట్ ఉన్నప్పుడు.. పాత్రల విషయంలో కొత్తవారిని తీసుకున్నంత మాత్రాన వచ్చే ఇబ్బందేమీ లేదు అనేది నా అభిప్రాయం. అలాగే నేను అనుకున్నది చెప్పాలంటే కొత్త ఆరిస్టులతో సాధ్యం అని భావించాను. అయినా ఓ ఫ్రెష్ కథ చెబుతున్నప్పుడు ఫ్రెష్ ఫేసెస్ తీసుకోవడమే మంచిది. ఆ ఆలోచనతో కొత్తవారిని తీసుకున్నాను.

 

ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు మీ టార్గెట్ ‘ఓటిటి’నా లేక థియేటర్సా ?

 

ఈ సినిమా కేవలం ‘ఓటిటి’ కోసమే చేసింది. ఇక నాకు లైఫ్ ఇచ్చింది ఓటిటి. అందుకే భవిష్యత్తులో కూడా ఓటిటిని వదలను. అలా అని ‘ఓటిటి’లో మాత్రమే చేస్తాను అని కాదు. థియేటర్స్ లో మన సినిమా విడుదల కావాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. ఓ బెస్ట్ మూవీ చేసే అవకాశం వస్తే థియేటర్ లో కూడా తప్పకుండా సినిమా చేస్తా.

 

మీకు పలానా హీరోతో చేయాలనే గోల్ ఏమైనా ఉందా?

 

ఇప్పటివరకూ ఒక పర్టిక్యూలర్ హీరోతో చేయాలనే ఆలోచన అయితే లేదు. కానీ కథలు విషయంలో మాత్రం పలానా కథ చెప్పాలనేది ఉంది. నా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం. దానికి తగ్గట్టుగా కథ రాసుకుంటాను. సబ్జెక్టుకు తగ్గట్టుగా హీరోల ఎంపిక జరుగుతుంది.

 

మీ పర్సనల్ లైఫ్ గురించి ?

 

మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. ఇక్కడ నేను ఒక్కడినే ఉంటాను. ఇంకా పెళ్లి కాలేదు. సొ.. నా పర్సనల్ లైఫ్ కూడా.. నాకు సినిమానే.

 

మేక సూరికి వచ్చిన రివ్యూల విషయంలో మీ అభిప్రాయం?

 

నిజానికి నేను రివ్యూస్ పెద్దగా పట్టించుకోను. పదిమంది రాసే రివ్యూస్.. లక్షల మంది ప్రేక్షకుల వ్యూను చూపించలేవు కదా. సినిమాలో కంటెంట్ ఉంటే రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారు. అయితే రివ్యూస్ వల్ల కొన్ని సినిమాలకు ప్లస్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.

 

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటీ?

 

ప్రస్తుతం ‘మేక సూరి’ మూవీకి సీక్వెల్ ఉంది, ఆ ప్రాజెక్ట్ తెరకెక్కించే ప్రణాళికలో ఉన్నాం. అలాగే ఈ మూవీకి మంచి ఆదరణ రావడంతో కొంతమంది నిర్మాతలు హీరోలు ఫోన్ చేసి కథలు చెప్పమని అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ‘మేక సూరి’ పార్ట్ 2 ప్లాన్ లో ఉన్నాను.

సంబంధిత సమాచారం :

More