ఫిబ్రవరి 13న ఇంగ్లీష్‌లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’. తక్ష్, మటిల్డా జంటగా అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాకు వస్తున్న విశేష స్పందనకు గాను చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా హీరో తక్ష్ మాట్లాడుతూ.. కేవలం రెండు పాత్రలతో కథను నడిపించడం అద్భుతమని, సీసాలో బంధించిన ఆత్మల నేపథ్యంలో సాగే ఈ కథను చూసి ఇళయరాజా సైతం ఆశ్చర్యపోయారని అన్నారు. “తన కెరీర్‌లో ఇంతవరకు ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదని ఇళయరాజా గారు అన్నారు.. ఆయన చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం” అని తక్ష్ ఆనందం వ్యక్తం చేశారు. మ్యూజిక్ బేస్ చేసుకుని త్వరలో చెన్నైలో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
దర్శకుడు అజిత్ వాసన్ మాట్లాడుతూ, ప్రేమకు భాష లేదనే ఉద్దేశ్యంతోనే ముందు ఇంగ్లీష్‌లో తెరకెక్కించామన్నారు. హీరోహీరోయిన్లు బాధ్యతగా నటించి సినిమాను తమ భుజాలపై మోశారని ప్రశంసించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు ‘బలగం’ సంజయ్ చిత్రయూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.


