రహమాన్ నిర్మాణంలో రూపొందే సినిమా డీటైల్స్

రహమాన్ నిర్మాణంలో రూపొందే సినిమా డీటైల్స్

Published on Aug 5, 2015 2:06 PM IST

AR-raheman
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ నిర్మాతగా మారి ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. తన అసాధారణ సంగీత ప్రతిభతో ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న రెహమాన్, అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి గడించారు. ఇక తన స్థాయికి తగ్గట్లుగానే సొంత ప్రొడక్షన్ హౌస్ వై.ఎమ్. స్టూడియోస్‌పై నిర్మించే మొదటి సినిమా ఉండాలని భావించిన ఆయన, తానే స్వయంగా స్క్రిప్ట్ రాయడం విశేషం.

మ్యూజికల్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ద్వారా విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకుడిగా పరిచయం కానున్నారు. సంగీత కళాకారుడు, స్టేజ్ ఆర్టిస్ట్ కూడా అయిన విశ్వేష్, గతంలో ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ టీవీ షో కోసం ప్రోమోలు రూపొందించారు. ఇక తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాకు 99 సాంగ్స్ (99 పడంగల్) అన్న పేరును ఖరారు చేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక సింగర్ జీవిత కథగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. హీరో పాత్ర కోసం కొత్త నటులను వెతికే పనిలో సినిమా యూనిట్ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలకు రహమాన్ ట్యూన్స్ పూర్తి చేసేశారట. ఇక ఈ ఏడాది చివర్లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళే ఆలోచనలో రహమాన్ ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు