సినీ తారలకు షాకిచ్చిన తమిళనాడు ఎన్నికలు

Published on May 4, 2021 1:01 am IST

సినిమాలు, రాజకీయాలు రెండూ పెనవేసుకున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు అనే అనాలి. అక్కడ సినీ తారలు రాజకీయాలను చాలానే ప్రభావితం చేసేవారు. అందుకే రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ కోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచేవి. ఎంజీఆర్. జయలలిత, విజయ్ కాంత్ ఇలా పలువురు సినీ తారలు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ ఇదంతా ఒకప్పుడు. నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినీ తారలకు అక్కడి రాజకీయాలు అస్సలు కలిసిరావట్లేదు. అందుకు నిదర్శనమే తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు.

ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల నడుమ మిగతా పార్టీలన్నీ నలిగిపోయాయి. ఇతర పార్టీల తరపున పోటీచేసిన పలువురు సినీ తారలు ఓటమిపాలు కావాల్సి వచ్చింది. సొంతగా పార్టీ పెట్టి పోటీ చేసిన విశ్వనటుడు కమల్ హాసన్ పోటీచేసిన కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. ఆయన పార్టీ ఒక్క సీటు కూడ గెలవలేకపోయింది. మరొక నటి ఖుష్బు బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అలాగే మరొక నటి శ్రీప్రియ ఎంఎన్ఎం పార్టీ తరపున ఎన్నికల్లో నిలిచి ఓటమిని చవిచూశారు.

కేవలం డీఎంకే తరపున పోటీచేసిన ఆ పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ మాత్రమే భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక రజినీకాంత్ అయితే ఎన్నికలకు ముందే రాజకీయాలకు రావట్లేదని ప్రకటించేశారు. మొత్తానికి ఈసారి తమిళనాడు ఎన్నికల్లో సినీ తారల ప్రభావం ఏమాత్రం పనిచేయలేదని తేలింది.

సంబంధిత సమాచారం :