
నందమూరి బాలకృష్ణ నటించిన 98వ సినిమా ‘లయన్’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి నందమూరి అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా నాయకుడిగా తమ విధులను సమర్దవంతంగా నిర్వహిస్తూనే, తన అభిమానుల కోసం ఏ మాత్రం బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. లయన్ రిలీజ్ అవ్వగానే బాలకృష్ణ తన తదుపరి 99వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. శ్రీ వాస్ దర్శకత్వం వహించించనున్న ఈ సినిమాని ఇరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం మే 29వ తేదీన అధికారికంగా కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. బాలయ్య 99వ సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే స్టార్ రైటర్స్ అయిన 5 మంది కలిసి ఈ సినిమా కథ – స్క్రీన్ ప్లే కోసం పనిచేసారు. వాళ్లే కోన వెంకట్, గోపి మోహన్, బివిఎస్ రవి, డైమండ్ రత్నం, శ్రీధర్ శ్రీపాన. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అంజలిని ఖరారు చేయగా మరో హీరోయిన్ కోసం ఆన్వేషణ జరుగుతోంది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

