“ఆనలుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గర్వించదగ్గ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ… ‘నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అనగానే నవ్వులు జ్ఞాపకం రావడం సత్యం. నాకు మాత్రం ఆయన నవ్వుల వెనక ఉన్న ఫిలాసఫర్ కనిపిస్తాడు. ఎర్రమందారం, మీ శ్రేయోభిలాషి, ఆ నలుగురులో అలాంటి మనిషిని చూశాను…. ఇప్పుడు బేవర్స్ లోని ఈ పాటలో చూశాను. రాజేంద్రప్రసాద్ గారు గొప్ప మనిషి. ప్రధానమంత్రి పివి నర్సింహరావు గారు కూడా రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి రిఫ్రెష్ అయ్యేవారు. రమేష్ గారు డెప్త్ ఉన్న రైటర్. రాజేంద్రప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ పాటను రాయమన్నారు. అరవింద్ నిర్మాతగా సక్సెస్ కావాలి. రచయితగా పాట రాసి ఆయన సక్సెస్ అయ్యారు. రమేష్ చెప్పాల గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నానని అన్నారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ కి కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్దమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తన మనసు, ప్రాణం పెట్టి రాసిన.. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. మీరు ఎప్పటికీ మర్చిపోరు. నా కూతురి పేరు గాయత్రి. నేను ఆమెతో మాట్లాడను. డైరెక్టర్ ఈ పాట నాకు వినిపించిన రోజు నేను ఏడ్చాను. నా కూతురిని పిలిపించుకొని నాలుగు సార్లు వినిపించాను. అంత అద్భుతమైన పాట అది. ఈ పాట రాసిన సుద్దాలకు నా మనసు ఇచ్చేస్తున్నాను. నా చిత్ర నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
చిత్ర కథానాయకుడు సంజోష్ మాట్లాడుతూ… పిలవగానే వచ్చిన అందరికీ చాలా థాంక్స్. వంద సంవత్సరాల సినీ చరిత్రలో మీ ముందు నిల్చుని మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. బేవర్స్ మంచి కథ. నాకు కొడుకు పాత్ర ఇచ్చారు రమేష్ గారు. ఇది కుటుంబ కథా చిత్రం అన్నారు.
నిర్మాతలు పొన్నాల చందు, డా. ఎమ్. యస్. మూర్తి, ఎమ్. అరవింద్ లు మాట్లాడుతూ.. డా. రాజేంద్రప్రసాద్ గారు నటించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓకటి. అలాంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన రమేష్ చెప్పాలా దర్శకుడిగా రాజేంద్రప్రసాద్ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బేవర్స్. మా బ్యానర్ పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాము. విడుదల చేసిన సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సంజోష్, హర్షిత లు హీరోహీరోయిన్స్ గా చాలా బాగా నటించారు. అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. అయితే ఆస్ట్రేలియ ప్రభుత్వం నుంచి జీవితసాఫల్య పురస్కారం అందుకుని రాజేంద్రప్రసాద్ గారు రిలీజ్ కి ముందే మా చిత్ర బృందంలో ఫుల్ జోష్ నింపారు.ఇలాంటి అరుదైన అవార్డులు ఆయనకు మరిన్ని రావాలి అని అన్నారు.


