విడుదల తేదీ : మార్చి 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, లక్ష్య, అదితి సైగల్, ఛాయా కదమ్, జుగల్ హన్సరాజ్, దీపన్నిత శర్మ, వరుణ్ బుద్ధదేవ్, అక్షయ్ ఒబెరాయ్, అంజుమన్ సక్సేనా, మాస్టర్ అమీర్ ఖాన్
దర్శకుడు : షానా గౌతమ్
నిర్మాతలు : కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా
సంగీతం : సచిన్-జిగర్, తుషార్ లాల్
సినిమాటోగ్రఫీ : అనుజ్ సమ్తాని
ఎడిటర్ : వైష్ణవి భాటే, సిధాంత్ సేథ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ అలాగే జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ హీరో హీరోయిన్స్ గా నటించిన తొలి చిత్రమే “నదానియన్”. మరి ఈ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
దక్షిణ ఢిల్లీకి చెందిన ఒక ధనవంతురాలైన టీనేజ్ అమ్మాయి పియా జై సింగ్ (ఖుషి కపూర్) తన స్కూల్ లో తన సోషల్ స్టేటస్ ని అలా మైంటైన్ చేయడానికి, తన ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేసేందుకు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అర్జున్ మెహతా (ఇబ్రహీం అలీ ఖాన్) ని తనకి ఒక వారం బాయ్ ఫ్రెండ్ లా ఉండేందు 25 వేలు ఇచ్చి మరీ ఎంపిక చేసుకుంటుంది. కానీ ఇక్కడ నుంచి వీరి పరిచయం, ఆ బాయ్ ఫ్రెండ్ ప్రయాణం ఎలా మారింది. ఈ జర్నీలో వీరిద్దరూ ఎలాంటి ఎమోషన్స్ కి గురయ్యారు. అన్ని రకాల గాను ఎంతో వ్యత్యాసం ఉన్న వీరి ప్రయాణం ఆ వారంలో ఎలా నడిచింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
యువ హీరోకి ఇబ్రహీం అలీఖాన్ ఈ చిత్రంతో ఒక డీసెంట్ డెబ్యూని ఇచ్చాడని చెప్పవచ్చు. తన తండ్రి సైఫ్ పోలికల్లోనే తన మార్క్ బాడీ లాంగ్వేజ్ కొన్ని సన్నివేశాల్లో మంచి కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తూ తాను ఆకట్టుకున్నాడు. అలాగే ఖుషితో కూడా కొన్ని లవ్ సీన్స్ తో మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది.
ఇక తనతో పాటుగా నటి దియా మీర్జా మంచి రోల్ చేసారని చెప్పవచ్చు. ఇబ్రహీం తల్లిగా మంచి నటన అందించారు. అలాగే జుగల్ హన్సరాజ్ రోల్ కూడా సినిమాలో బాగుంది. తనపై కొన్ని ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. యంగ్ జంట డెబ్యూని మాత్రం వారి తల్లిదండ్రులు ఎక్కడా తగ్గకుండానే ఉండేలా రిచ్ గానే ప్లాన్ చేసుకున్నారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా టైటిల్ నదానియన్ అంటే మూర్ఖత్వమో, అవివేకం లాంటివి వస్తాయి. మరి ఏమనుకొని అదే టైటిల్ పెట్టారో సినిమా కూడా అంతే దారుణంగా అనిపిస్తుంది. చాలా సింపుల్ లైన్ తీసుకొని దానికి అనవసర ఖర్చులు చేసి ఒక సిల్లీ ప్రోడక్ట్ ని మేకర్స్ అందించడం గమనార్హం.
ఒక రకంగా ఈ సినిమా డైరెక్ట్ ఓటిటిలోనే రిలీజ్ చేసుకోవడం మంచి విషయం అని కూడా చెప్పాలి. లేకపోతే థియేటర్స్ లో కానీ చూసుంటే ఆడియెన్స్ ని గట్టిగా విమర్శలు వచ్చేవి. ఇక ఖుషి కపూర్ విషయానికి వస్తే ఆమె చూసేందుకు బానే ఉంది నటన పరంగా మాత్రం అస్సలు మెప్పించలేదు.
నటన పరంగా ఆమె చాలా మెళుకువలు నేర్చుకోవాల్సి ఉంది. చాలా సన్నివేశాల్లో తన హావా భావాలూ, డైలాగ్ డెలివరీ చాలా అసహజంగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాని ప్రెజెంట్ జెన్ జెడ్ జెనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని తీశారు కానీ వారు కూడా ఈ సినిమాని తిట్టుకునే రేంజ్ లో సాధ్యమైనంత ఎక్కువే క్రింజ్ లెవెల్లో తీశారు.
ఇక వీటికంటే ఈ సినిమా రన్ టైం ఉన్నదే 2 గంటల్లోపే అయినప్పటికీ చూస్తున్నంతసేపు పరమ బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అనవసరమైన పాటలు, బోర్ కొట్టించే సన్నివేశాలు ఈ సినిమాని మరింత చికాకు తెప్పించేలా మార్చేశాయి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. రిచ్ విజువల్స్ టెక్నీకల్ గా కూడా ఈ చిత్రం స్ట్రాంగ్ గానే ఉంది కానీ ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చేయాల్సింది. ఇక షౌనా గౌతమ్ దర్శకత్వం విషయానికి వస్తే.. తాను చాలా రొటీన్ లైన్ ని తీసుకున్నారు కానీ దానికి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఎక్కడా రాసుకోలేకపోయారు. ఏ జెనరేషన్ కోసం సినిమా తీశారో, కనీసం వారికి కూడా కనెక్ట్ కాని విధంగా తెరకెక్కించి డిజప్పాయింట్ చేశారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘నదానియన్’ సినిమాతో ఇబ్రహీం అలీఖాన్ మంచి నటన కనబరిచాడు కానీ విషయం లేని సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన ఎఫర్ట్స్ వృధా చేసుకున్నాడని చెప్పక తప్పదు. ఖుషీ కపూర్ ఇంకా బెటర్ కావాల్సి ఉంది. సినిమాలో ఎంగేజ్ చేసే అంశాలే పెద్దగా లేవు. సో వీటితో ఈ వీకెండ్ లో ఓటిటిలో ఈ సినిమాని స్కిప్ చేసుకొని వేరే బెటర్ ఆప్షన్ ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team