విడుదల తేదీ : ఫిబ్రవరి 07, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి, దివ్య పిళ్ళై, ఆడుకాళం నరేన్, కరుణాకరన్
దర్శకుడు : చందూ మొండేటి
నిర్మాత : బన్నీ వాసు
సంగీతం :దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : షామ్ దత్
ఎడిటర్ :నవీన్ నూలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు (అక్కినేని నాగచైతన్య) సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరో వైపు సత్య (సాయి పల్లవి) అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యాకి కూడా అంతే ప్రాణం. చిన్న తనం నుంచే ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలుపాలైన రాజు, అతని టీమ్ రాక కోసం సత్య ఏం చేసింది ?, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది?, అసలు మనసులో రాజును పెట్టుకుని, సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది ?, చివరకు సత్య – రాజు ఒక్కటి అయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ తండేల్. కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని వేదన.. ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరోహీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందూ మొండేటి బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతుకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది.
హీరోగా నాగచైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతు తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో సాయి పల్లవి పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్య పిళ్ళై తన నటనతో ఆకట్టుకోగా.. ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన ఆడుకాళం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకరన్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మొత్తమ్మీద చందూ మొండేటి రాసిన కథనం మరియు పాత్రలు ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను చాలా బాగా మలిచాడు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు చందూ మొండేటి.. కథలోని ప్రధాన పాత్రలను, కథా నేపథ్యాన్ని అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్సే కదా అని ఫీల్ ని కలిగిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ల్యాగ్ అనిపిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ ప్లే, స్లో నేరేషన్ వంటి అంశాలు సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి.
సాంకేతిక విభాగం :
సినిమాలో షామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రేమ కథకు అనుగుణంగా విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా సాయి పల్లవి పై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ల్యాగ్ సీన్స్ లెంగ్త్ ను తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాలో నిర్మాత బన్నీ వాసు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు చందూ మొండేటి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకున్నారు.
తీర్పు :
తండేల్ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా, బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ బాగా ఆకట్టుకుంది. పైగా, గుడ్ కంటెంట్ తో పాటు డీసెంట్ టేకింగ్, మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఐతే, స్క్రీన్ ప్లే లో స్లో నేరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. కానీ, చైతు, సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. చందూ రచన – దర్శకత్వం కూడా మెప్పించాయి. మొత్తమ్మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team