ఇంటర్వ్యూ : నందమూరి బాలకృష్ణ – ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు మంచి అనుభూతికి లోనవుతారు.

Published on Jan 6, 2019 9:51 pm IST

బాలయ్య నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

మీ తండ్రి మహానటుడు ఎన్టీఆర్ గారి పై సినిమా తీయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు ?

గత ఏడాది మా తండ్రిగారి స్వగ్రామం నిమ్మకూరులో ఓ హాస్పిటల్ ప్రారంభించడానికి వెళ్లాను. అప్పుడు మీడియాతో ప్రసంగించేటప్పుడు, ఈ ప్రాజెక్ట్ గురించి అడిగారు. ఆ సమయంలో నేను ఎందుకు చెప్పానో తెలియదు కానీ, ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేశాను. బహుశా నా తల్లిదండ్రులే నేను ఈ సినిమా చేసేలా నా చేత ఆ ప్రకటన చేయించారేమో.

మొదట ఈ బయోపిక్ కి తేజ దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఎందుకు దర్శకుడ్ని మార్చాల్సి వచ్చింది ?

మేము చాలా పాజిటివ్ నోట్ లో చాలా సానుకూల అంశాలతోనే ఈ బయోపిక్ ని ప్రారంభించాము. కానీ దురదృష్టవశాత్తూ, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చెయ్యలేనేమో అనే ఆలోచనలతో సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తరువాత, ఇక నేనే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. కానీ క్రిష్ వచ్చి నేను డైరెక్ట్ చేస్తానని నన్ను అడిగారు. అప్పటికే మేం గౌతమి పుత్ర శాతకర్ణి చెయ్యడం.. పైగా తన దర్శకత్వ శైలి పై నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకే ఇంకేమి ఆలోచించకుండా వెంటనే క్రిష్ డైరెక్టర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

చాలా తక్కువ రోజుల్లోనే ఇంత పెద్ద సినిమా షూటింగ్ ను ఎలా పూర్తి చేయగలిగారు ?

నిజంగా తక్కువ రోజుల్లోనే ఇంత పెద్ద సినిమాని మేం చెయ్యడానికి కారణం కట్టుదిట్టమైన మా ప్రణాళిక అలాగే మా టీం సమిష్ట కృషి అని చెప్పాలి. పైగా ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా మాకు ఎలాంటి అవాంతరాలు ఆటంకాలు ఎదురుకాలేదు. నేను ముందు చెప్పినట్లుగానే, మా నాన్నగారి సోలే మా చుట్టూ ఉండి మమ్మల్ని ముందుకు నడిపారని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను.

మీరు మీ తండ్రిగారి పాత్రలో నటించడం గురించి చెప్పండి ?

నాన్నగారి పాత్రను పోషిస్తున్నానే అనే ఒత్తిడి నా పై ఎప్పుడూ లేదు. ఒకవిధంగా నేను చాలా ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ మా నాన్నగారి పాత్రలో నటించాను. ఎందుకంటే ఆయన గురించి నాకు ప్రతిదీ తెలుసు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు ఇలా ప్రతి దాని పై నాకు అవగాహన ఉంది. వ్యక్తిగతంగా, ఎన్.టి.ఆర్ నా తండ్రి మాత్రమే కాదు, నాకు ప్రేరణ, నాకు గురువు ఇలా అన్ని నాకు ఆయనే. ఆయన ప్రభావం నా పై బలంగా ఉంది.

మీ దర్శకుడు క్రిష్ గురించి కొన్ని మాటలు?

మా మధ్య మంచి అవగాహన ఉంది. సినిమాకి సంబంధించి ప్రతిదీ చర్చించుకుంటాము. తను సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. షూటింగ్ లో కూడా ప్రతిరోజూ ఒక సవాలుగా పని చేస్తాడు, ఈ సినిమాలో నటీనటులందరూ బాగా చేసారంటే దానికి కారణాలు మాత్రం క్రిష్ అంకితభావం మరియు నిబద్ధతే.

విద్యాబాలన్ మీ అంచనాలను అందుకోగలిగారా ?

ఖచ్చితంగా.. తను కూడా చాలా అద్భుతంగా నటించింది. మా అమ్మగారి పాత్రలో ఆమె నిజంగా చాలా బాగా నటించింది. తను ఈ సినిమాని అంగీకరించినందుకు తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి.

రానా కూడా కీలక పాత్రలో నటించారు. ఆయన గురించి చెప్పండి?

చంద్రబాబు నాయుడుగారి పాత్రలో రానా చాలా బాగా నటించారు. సినిమాలో తను అచ్చం చంద్రబాబుగారిలానే కనిపిస్తాడు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, శ్రియ, నిత్యా మీనన్ ఇలా ఇతర కళాకారులందరూ కూడా చాలా బాగా నటించారు. తమ పాత్ర యొక్క వ్యవధి గురించి అస్సలు ఆలోచించకుండా చిన్న పాత్రలు అయినా అంగీకరించి.. ఆయా పాత్రలకు జీవం పోశారు. అలాగే భరత్ రెడ్డి మరియు ఇతర కళాకారులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలును పోషించారు.

చివరగా, కథానాయకుడు అవుట్ ఫుట్ విషయంలో మీరు పూర్తి సంతృప్తిగా ఉన్నారా?

ఒక నిర్మాతగా మరియు నటుడిగా ఈ సినిమా నాకు, మా చిత్రబృందానికి పూర్తి సంతృప్తిని ఇచ్చింది. మా ప్రయత్నం మేం చాలా నిజాయితీగా చేశాము. ఇక ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది, ఎందుకంటే వాళ్లేగా సినిమా ఎలా ఉంది అని తుది తీర్పు చెప్పేది. అయితే ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా థియేటర్లలో నుండి బయటకు వచ్చేటప్పుడు మంచి అనుభూతితో బయటకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.

సంబంధిత సమాచారం :

More