‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమ కళ్ళను తన వైపుకు తిప్పుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. లేడీ డైరెక్టర్స్ ఎప్పుడో గానీ కనిపించని ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్, తన రెండో సినిమా ‘జబర్దస్త్’ పరాజయం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక తాజాగా నందిని రెడ్డి యువహీరో నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది.
గత కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్‌లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ అతి తక్కువకాలంలో పూర్తైంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తైందని నందిని రెడ్డి తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశానని, ఇప్పుడు అందరినీ మిస్ అవుతామనే ఫీలింగ్ కలుగుతోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఇక ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘కళ్యాణ వైభోగమే’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు.


