
‘అష్టాచమ్మా’.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు, నాని, అవసరాల శ్రీనివాస్‌లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా. ‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాని, ఆ తర్వాత అనతికాలంలోనే వరుస హిట్లతో హీరోగా మంచి స్థానం సంపాదించారు. ప్రస్తుతం ఎవడే సుబ్రమణ్యం ఇచ్చిన ఉత్సాహంతో వరుస సినిమాలతో బిజీ అయిన నాని, అష్టాచమ్మా కాంబినేషన్‌ను మళ్ళీ లైన్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇంద్రగంటి మోహన కృష్ణ గత చిత్రమైన బందిపోటు నిరాశ పరచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మళ్ళీ తనదైన సినిమా చేసేందుకు ప్రస్తుతం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే మోహన కృష్ణ.. నానికి ఓ కథ సిద్ధం చేశారని, నాని కూడా ఈ సినిమాకు సిద్ధమైపోయారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఈ కాంబినేషన్‌పై ఓ ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక మోహన కృష్ణ డైలాగుల్లోని కొత్తదనానికి, నాని స్టైల్లో వచ్చే ఆ ఎక్స్ప్రెషన్ కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే అష్టా చమ్మాలో చూసేశాం. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే అది మంచి విశేషమే!

