ఇంటర్వ్యూ : నాని – నాకు, నాగ్ సార్ కి మధ్య కెమిస్ట్రీ, సినిమాకే ప్రత్యేకంగా నిలుస్తోంది.

Published on Sep 26, 2018 4:29 pm IST

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ‘భలే మంచి రోజు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా, ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో నాని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీ సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తోన్న క్రమంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం ప్లాప్ అయింది. దాన్ని మీరు ఎలా అధిగమించారు?

నేను ఆ సినిమా కోసం ఎంత ఎఫెక్ట్స్ పెట్టాలో అంతా పెట్టాను. నిజానికి ‘కృష్ణార్జున యుద్ధం’ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, దాని మీద మేం చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ ప్రేక్షకులకు ఆ చిత్రం నచ్చలేదు. మా ప్రయత్నపరంగా అయితే మాత్రం, ఎక్కడా లోపం జరగలేదు. 100% పర్సెంట్ మేం హార్డ్ వర్క్ చేశాము. అయినా జీవితంలో ఎదుగుతున్నప్పుడు.. కొన్ని ఎదురు దెబ్బలు, అడ్డంకులు ఎదురవుతాయి. ‘కృష్ణార్జున యుద్ధం’ ప్లాప్ కూడా నా ఎదుగుదలకి వచ్చిన చిన్న అడ్డంకి అనుకుంటున్నాను. అయినా నేను కంటిన్యూగా హిట్స్ ఇస్తున్నాను. ఆ మధ్యలో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా నా కెరీర్ కి (నవ్వుతూ) దిష్టి తగలకుండా ఉండటానికి.

ఈ సినిమాలో కింగ్ నాగార్జునగారితో కలిసి నటించారు. ఎలా అనిపించింది. ఆ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

ఈ సినిమాకి నేను సైన్ చేస్తున్న క్షణంలోనే.. నా మైండ్ లో రకరకాల ప్రశ్నలు.. అసలు నాగ్ సార్ తో ఎలా ఉండాలో.. ఆయన నన్ను ఎలా ట్రీట్ చేస్తారో.. మా కాంబినేషన్ లోని సీన్స్ షూట్ చేసే సమయంలో ఎలా ఉంటుందో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. యాక్ట్ చెయ్యడానికి ఎదుటి వ్యక్తికి ఎప్పుడు స్కోప్ ఇచ్చే వ్యక్తి ఆయన. రేపు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు నా పాత్రను ఇష్టపడినట్లయితే, ఆ క్రెడిట్ మొత్తం నాగ్ సర్ కే చెందుతుంది.

సోలో హీరోగా మంచి హిట్స్ ఇస్తున్నారు. ఉన్నట్లు ఉండి మల్టీ స్టారర్ లో నటించడానికి కారణం ఏమిటి ?

మేం మల్టీ స్టారర్ మూవీస్ చేయట్లేదని మీరే ఎప్పుడు ఫిర్యాదు చేస్తారుగా. శ్రీరామ్ ఆదిత్య ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఇక ఈ స్టార్ డమ్ గురించి, ఇమేజ్ గురించి నేను పెద్దగా ఆలోచించను. ఇలాంటి మంచి సినిమాలు చేస్తేనే.. ఇంకా మంచి కథలు వస్తాయి. అన్నిటికి మించి నాకు నాగార్జునగారి పక్కన నటించే అవకాశం వచ్చింది. దాంతో పాటు వైజయంతి బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును ఎలా వదులుకుంటాం.

ఈ చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గురించి చెప్పండి ?

ఈ కథ చాలాకాలంగా వైజయంతి బ్యానర్ లోనే ఉంది. అప్పటికీ మేం ఈ కథకు తగ్గ సరైన దర్శకుడు కోసం చూస్తున్నాము. ఆ సమయంలో నేను శమంతకమణి, భలే మంచి రోజు ట్రైలర్లను చూశాను. నాకు శ్రీరామ్ వర్క్ చాలా బాగా నచ్చింది. తన్ని పిలిచి, ఈ కథ చెప్పి ఫైనల్ డ్రాఫ్ట్ తో రావాలని కోరాము. తను కథ పై వర్క్ చేశాడు. ‘ఎమ్.సి.ఎ’ షూట్ సమయంలో తను నాకు పూర్తి స్క్రిప్ట్ ను వినిపించాడు, నాకు చాలా బాగా నచ్చింది. నాగ్ సార్ కి కూడా నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. శ్రీరామ్ చాలా సమర్ధవంతమైన దర్శకుడు. మమ్మల్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు.

ఈ ‘దేవదాస్’ నుండి ప్రేక్షకులు ఏమి ఆశించ వచ్చు ?

ఈ సినిమాలో అద్భుతమైన వినోదంతో పాటు.. మంచి భావోద్వేగాలు కూడా ఉన్నాయి. సరదాగా సాగే సన్నివేశాలు కడుపొబ్బా నవ్విస్తాయి. దేవ మరియి దాస్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుటుంది. సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తోంది.

‘బిగ్ బాస్’ మీ పై ఎలాంటి ప్రభావం చూపింది ? వ్యక్తిగతంగా ఏమైనా మీలో మార్పులు తీసుకొచ్చిందా ?

‘బిగ్ బాస్’ నా పై చాలా ప్రభావం చూపింది. నా చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎంత మృదువుగా మాట్లాడాలి, ఇలా చాలా విషయాల్లో బిగ్ బాస్ నాలో మార్పు తీసుకొచ్చింది. ఒక విధంగా నా జీవితంలో కొత్త కోణం చూపించింది. ఈ మూడు నెలల్లో నాలో చాలా మార్పులు వచ్చాయి.

సంబంధిత సమాచారం :