
‘అష్టా చమ్మా’.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు, నాని, అవసరాల శ్రీనివాస్‌లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా. ‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాని, ఆ తర్వాత అనతికాలంలోనే వరుస హిట్లతో స్టార్ హీరో స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక మళ్ళీ ఏడేళ్ళకు నాని-మోహన కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత హీరోగా స్టార్ స్టేటస్‍ను సొంతం చేసుకున్న నాని, దర్శకుడు హను రాఘవపూడితో తన కొత్త సినిమా షూటింగ్‌ను కూడా అప్పుడే పూర్తి చేసేసి, ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళారు.
తెలుగులో ఇప్పటివరకూ రానటువంటి ఓ సరికొత్త జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా గత వారం సెట్స్‌పైకి వెళ్ళింది. తాజాగా హీరో నాని కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఓ ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీని జతకలిపి ఓ సరికొత్త కథగా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దారట. ఏడేళ్ళ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో కలిసి మళ్ళీ పనిచేయడం చాలా సంతోషంగా ఉందని నాని తెలిపారు. గతంలో ‘ఆదిత్య369’ లాంటి క్లాసిక్ సినిమాను నిర్మించిన కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సురభి, నివేదిత థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

