సమీక్ష: ‘గుర్రం పాపిరెడ్డి’ – కొన్ని నవ్వులు మాత్రమే

సమీక్ష: ‘గుర్రం పాపిరెడ్డి’ – కొన్ని నవ్వులు మాత్రమే

Published on Dec 20, 2025 3:02 AM IST

Gurram Paapi Reddy Review

విడుదల తేదీ : డిసెంబర్ 19, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు
దర్శకుడు : మురళీ మనోహర్
నిర్మాణం : వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
సంగీత దర్శకుడు : కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రాఫర్ : అర్జున్ రాజా
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అవతార్ 3 లాంటి భారీ సినిమాతో పెద్దగా ఏ ఇండస్ట్రీ నుంచి కూడా పోటీకి సినిమాలు రాలేదు. అయితే మన తెలుగు నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నరేష్ అగస్త్య హీరోగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం “గుర్రం పాపిరెడ్డి” వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) అలాగే సౌదామిని (ఫరియా అబ్దుల్లా) లు కలిసి ఒక ముగ్గురు గ్యాంగ్ గొయ్యి (జీవన్), చిలిపి (వంశీధర్ గౌడ్) అలాగే మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి) లతో కలిసి శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో మరో శవంతో మార్చాలని ప్లాన్ వేస్తారు. అసలు ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలనుకున్నారు? ఈ క్రమంలో రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) లు గుర్రం పాపిరెడ్డిని టార్గెట్ చేసి అతన్ని వెతుకుతూ ఉంటారు. అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? అతడు వీళ్ళకేం చేసాడు? పైగా వాళ్ళ ఆస్తి ఎందుకు కొట్టేయాలని చూస్తాడు? చివరగా ఎవరికి లాభం వచ్చింది? ఎవరికి నష్టం వచ్చింది? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో కొద్దో గొప్పో ఆకట్టుకునే అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే అక్కడక్కడా మంచి నవ్వు తెప్పించే కామెడీ సీన్స్ అని చెప్పాలి. దర్శకుడు ప్రతీ పాత్రని డిజైన్ చేసుకున్న విధానం వాటి చుట్టూ డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ లు మంచి నవ్వు తెప్పిస్తాయి. మెయిన్ గా ఫస్టాఫ్ లో కామెడీ ట్రాక్స్ సినిమా మొదలైన ఒక అరగంట పాటుగా సాలిడ్ ఫన్ తో కథనం సాఫీగా వెళ్ళిపోతుంది.

ఈ ట్రాక్ లలో నటుడు జీవన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది వరకు కూడా కొన్ని కామెడీ రోల్స్ చేశారు కానీ ఇందులో తాను చేసిన గొయ్యి పాత్రలోని అమాయకత్వం, అందులో తన పెర్ఫామెన్స్ లు చాలా బాగుంది. ఇక తనతో పాటుగా మిలట్రీ పాత్రలో రాజ్ కసిరెడ్డి కూడా సాలిడ్ ఫన్ ని అందించాడు. స్మశాన వాటికలో ట్రాక్ ఇంకా క్లైమాక్స్ లో యోగిబాబుతో ఫన్ సీన్స్ బాగున్నాయి.

ఇక వీటితో పాటుగా టాలెంటెడ్ నటుడు నరేష్ అగస్త్యకి మరో డీసెంట్ రోల్ పడింది అని చెప్పొచ్చు. తన మార్క్ ఈజ్ తో తన రోల్ లో మంచి టైమింగ్ తో తను నటించాడు. అలాగే ఫరియా కూడా తన రోల్ లో బాగా చేసింది. గ్లామర్ తో పాటుగా మంచి నటన ఆమె ప్రదర్శించింది. ఇద్దరు లీడ్ నటులూ ప్రొస్థెటిక్ మేకప్ లో సీన్స్ చేయడం తమ డెడికేషన్ చూపిస్తుంది. ఇక వీరితో పాటుగా వంశీధర్ గౌడ్ కూడా తన రోల్ లో మంచి ఫన్ ని అందించాడు. అలాగే ఈ సినిమాలో వచ్చే ఫన్ సీన్స్ వరకు మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా ఎలాంటి డోకా ఉండదు, కొన్ని ట్విస్ట్ లు డీసెంట్ గా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో డీసెంట్ ఫన్ అండ్ ట్విస్ట్ లు ఉన్నప్పటికీ కథనం మాత్రం చాలా సాగదీతగా చూసే ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా సాగుతూనే ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. స్టార్టింగ్ ఒక అరగంట నుంచి నలభై నిమిషాలు మంచి ఫన్ ట్రాక్స్ తో వెళ్లిన సినిమా మెయిన్ ప్లాట్ లోకి వెళ్లిన తర్వాత అందులో బలం లేదు అనిపిస్తుంది.

కొంచెం రొటీన్ ప్లాట్ నే తీసుకొని నడిపించినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఈ మధ్య కాలంలోనే వచ్చిన కొన్ని ఫన్ క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు రాక మానవు. ఒక స్వాగ్, బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమాలు తరహాలో ఇదీ అనిపిస్తుంది. సో కొత్తదనం ఆశించేవారికి ఒకింత డిజప్పాయింట్ చేస్తుంది. దీనికి తోడు ఒక ఫ్లోలో వెళ్తున్న కథనంకి ఆ పాటలు మరింత అడ్డుగా అనిపిస్తాయి.

ఎడిటింగ్ లో ఫస్టాఫ్ లో ఓ సాంగ్ సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో ఓ సాంగ్ తీసేసి ఉండాల్సింది. అప్పుడు కథనం ఇంకొంచెం టైట్ గా ఉండేది. వీటి మూలాన సినిమా ఇంకా పెద్దగా అనిపిస్తుంది. అలానే మెయిన్ లీడ్ పాత్రలు తమకి ఓ నష్టం జరిగాక చకచకా వేసేసే ప్లాన్ లు రియాలిటీకి దూరంగా సిల్లీగా అనిపిస్తాయి.

ఇంకా నటుడు యోగిబాబు లాంటి కమెడియన్ ని పెట్టుకొని తక్కువే వాడుకున్నారు. ఇంకా లెజెండరీ బ్రహ్మానందంకి ఇంకా మంచి ఫన్ ట్రాక్స్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇలా ఈ సినిమాలో మెప్పించే అంశాలు ఎన్ని ఉన్నాయో.. వాటికంటే బోర్ గా నొప్పించే అంశాలు అంతకు ఎక్కువే ఉన్నాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. మేకర్స్ పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. అలానే ప్రొడక్షన్ డిజైన్ కూడా డీసెంట్ గా ఉంది. కృష్ణ సౌరభ్ సంగీతం బాగుంది. అర్జున్ రాజా కెమెరా వర్క్ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ లో కొంతమేర బాగానే ఉంది కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ ఇంకా పాటలు కట్ చేయాల్సింది. నిరంజన్ రామిరెడ్డి అందించిన డైలాగ్స్ వర్క్ బాగుంది. మెయిన్ గా కామెడీ రైటింగ్ బాగుంది.

ఇక దర్శకుడు మురళీ మనోహర్ విషయానికి వస్తే.. తన వర్క్ ఇందులో కామెడీ ట్రాక్స్ వరకు బాగుంది కానీ మెయిన్ పాయింట్ లో మాత్రం సింపుల్ గానే ఉంది. మెయిన్ గా డెప్త్ ఇందులో మిస్ అయ్యింది. ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. ఇంకా ముఖ్యంగా కథనంని చాలా డ్రాగ్ చేశారు. చాలా వరకు సీన్స్ తగ్గించుకొని ఉంటే ఈ క్రైమ్ కామెడీ మరింత ఇంపాక్ట్ చూపించి ఉండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘గుర్రం పాపిరెడ్డి’ లో ప్రధాన పాత్రలు అంతా మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. అలాగే అక్కడక్కడా మంచి ఫన్ ట్రాక్స్ ఇందులో హిలేరియస్ గా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఈ ఫన్ కి తగ్గట్టుగా కథనం కూడా కొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కేవలం కొన్ని నవ్వులు వరకు చాలు ల్యాగ్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ సినిమాని తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేయొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు