యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన సినిమాలను చాలా వెరైటీగా ప్రమోషన్స్ చేస్తుంటాడు. తోటి హీరోలకు భిన్నంగా సరికొత్త పంథాలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం నవీన్ శైలి. అయితే ఈసారి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, తన కొత్త సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. తాజాగా నవీన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫన్నీ రీల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడేలా చేయడం కోసం నవీన్ పొలిశెట్టి ఇండియన్ సినిమాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సుకుమార్ మరియు రిషబ్ శెట్టిలను ఒకే చోటకి తీసుకువచ్చాడు. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న క్రేజీ దర్శకులందరూ ఇందులో కనిపించడంతో.. తన కెరీర్‌లోనే ఇది ‘కాస్ట్లీ రీల్’ అని నవీన్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా, ఆ రీల్‌లో ఉన్న దర్శకులందరి కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్లను ఉద్దేశిస్తూ.. తనదైన మార్క్ టైమింగ్‌తో దీన్ని ఒక రూ.5000 కోట్ల ఫ్రేమ్ అని చెప్పుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరు, అలాగే మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


