రామ్ చరణ్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్?

రామ్ చరణ్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్?

Published on Oct 24, 2015 11:11 AM IST

ram-charan-ana-nail-nithin
తమిళంలో ఈమధ్యే విడూదలై ఘన విజయం సాధించిన తని ఒరువన్ అనే సినిమాను తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. జయం రవి హీరోగా, గతంలో హీరోగా పలు క్లాసిక్ సినిమాల్లో నటించిన అరవింద్ స్వామి విలన్‌గా రూపొందిన తని ఒరువన్ సినిమా తమిళ నాట సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సురేందర్ రెడ్డి రామ్ చరణ్ హీరోగా రూపొందించనున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందన్న అనౌన్స్‌మెంట్ వచ్చినరోజునుంచే ఈ సినిమాలో విలన్‌గా నటించేదెవరంటూ రకరకాల పేర్లు వినిపించాయి. తమిళంలో అరవింద్ స్వామి అద్భుతంగా పోషించిన పాత్రకు తెలుగులో మాధవన్, సుధీప్ తదితరులను సంప్రదిస్తుండగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ను కూడా తని ఒరువన్ రీమేక్‌లో చరణ్‌కు విలన్‌గా నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో న్యూయార్క్, జైల్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నితిన్ ముఖేష్, తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి సినిమాతో సౌత్‌కు పరిచయమయ్యారు. ఇక రామ్ చరణ్‌కు విలన్‌గా నితిన్‌ను సంప్రదిస్తూ ఉండడం ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు