కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
కానీ, ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తొలుత భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వాయిదాకు ప్రధానంగా డిజిటల్ హక్కుల డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడమే కారణమని తెలుస్తోంది. నిర్మాతలు ఓటిటి హక్కుల కోసం భారీ ధరను డిమాండ్ చేస్తుండటంతో ఒప్పందం కొలిక్కి రావడం లేదు. దీనికి తోడు, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా ఆర్థిక వ్యవహారాల్లో బిజీగా ఉండటం కూడా ‘టాక్సిక్’ విడుదలకు అడ్డంకిగా మారింది.
ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల జూన్ 4న సినిమా రావడం అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


