రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (WATT) నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. నవంబర్ 30, 2025న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీ ప్రమాణస్వీకారం చేసింది. ఎన్నికల అధికారి డాక్టర్ ఎం. వినోద్ బాల పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ నూతన కమిటీలో అధ్యక్షుడిగా ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు, ప్రధాన కార్యదర్శిగా జి. శ్రీ శశాంక, కోశాధికారిగా వై. నరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా బి.వి. రామారావు, జాయింట్ సెక్రటరీగా ఎం. ఫణి కుమార్ ఎన్నికయ్యారు. ప్రముఖ రచయితలు బుర్రా సాయి మాధవ్, అంజన్ మేగోటి సమక్షంలో నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జి. శ్రీ శశాంక సంఘం అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై నివేదికను సభ్యులకు వివరించారు. అతిథులుగా హాజరైన దర్శకుడు శివ నాగేశ్వరరావు, కాదంబరి కిరణ్ కుమార్ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం ముగింపులో, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీకి సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.


