‘జనతా గ్యారేజ్‌’కు కొత్త సీన్లు కలుస్తున్నాయ్!

7th, September 2016 - 04:27:26 PM

Janatha-Garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన గత వారం విడుదలైన ఈ సినిమా పలుచోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సినిమా చూసి ఉన్న అభిమానులు మళ్ళీ చూసేలా, కొత్తగా కొన్ని సన్నివేశాలను జత చేస్తున్నారు. రేపట్నుంచి అన్ని ప్రాంతాల్లో కొత్తగా జత చేసిన సన్నివేశాలతో సినిమా ప్రదర్శితం కానుంది.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’.. ఈ రెండు సినిమాల విషయంలోనూ ఒక వారం తర్వాత కొత్త సన్నివేశాలను జత చేయడం జరిగింది. ఇప్పుడు తన మూడో సినిమాకూ కొరటాల దీన్ని మళ్ళీ రిపీట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 60 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.