మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “నిశ్శబ్ద”. ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “నిశ్శబ్ద” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ.. “నిశ్శబ్ద” చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఆయన ఈ చిత్రంతో ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు అని అన్నారు.
యువ హీరో కృష్ణ మాట్లాడుతూ.. “నిశ్శబ్ద” సినిమా టీజర్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. డైరెక్టర్ రమణమూర్తి మంచి హారర్ థ్రిల్లర్ మూవీని చూపించబోతున్నాడు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఇలాగే చాలామంది యంగ్ టాలెంట్ కు అవకాశాలు ఇవ్వాలి అని అన్నారు.
యువ హీరో సంజయ్ మాట్లాడుతూ.. టీజర్ లాంఛ్ సందర్భంగా “నిశ్శబ్ద” టీమ్ అందిరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా. సినిమాల్లో చిన్నవి, పెద్దవి అనేది ఉండదు కంటెంట్ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. “నిశ్శబ్ద” సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉన్నట్లు టీజర్ తో తెలుస్తోంది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. “నిశ్శబ్ద” టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా కూడా అంతే బాగుంటుంది. త్వరలోనే మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తాం. ఇంకా నాలుగైదు ఇంట్రెస్టింగ్ మూవీస్ మా ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీలైనంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి కంటెంట్ ఉన్న మంచి చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
డైరెక్టర్ రమణమూర్తి తంగెళ్లపల్లి మాట్లాడుతూ.. ‘నేను గతంలో ప్రేమ తరంగాలు అనే ఓ లవ్ స్టోరీ మూవీ రూపొందించాను. ఇప్పుడు “నిశ్శబ్ద” అనే హారర్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమా చేసే క్రమంలో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. మొత్తం రాత్రుళ్లు షూటింగ్ చేశాం. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 వరకు షూటింగ్ చేసేవాళ్లం. మా కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ కు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరి ఆదరణతో “నిశ్శబ్ద” సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు.


