
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో దశాబ్ద కాలం పాటు అద్భుతమైన హాస్య పాత్రలు పోషించి మెప్పించిన నటుడు కొండవలస లక్ష్మణరావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘ఔను.. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు’ సినిమాతో తెలుగు పరిశ్రమకు నటుడిగా పరిచయమైన కొండవలస, ఆ తర్వాత వరుసగా హాస్య ప్రధాన పాత్రలు పోషిస్తూ సుమారు 200కి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా మెప్పించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ సాయంత్రం చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు.
శ్రీకాకుళం జిల్లా కొండవలసలో జన్మించిన లక్ష్మణరావు సినిమాల్లో రావడానికి ముందు నాటక రంగంలో ప్రసిద్ధి గాంచారు. విశాఖ పోర్టులో ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే పలు నాటకాల్లో ఆయన తనదైన ముద్రతో రాణించారు. నంది అవార్డుతో పాటు నాటక రంగంలో పలు ఇతర ఎన్నో అవార్డులను అందుకున్న కొండవలస ఇప్పటికే తన మొదటి సినిమా ఔను.. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులోని ‘ఐతే ఓకే..’ అన్న డైలాగ్‌తోనే గుర్తించబడుతూ ఉన్నారు.

