ఆ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ!

18th, July 2016 - 04:04:47 PM

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోన్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ దర్శకుల జాబితాలో చేరిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమా కావడం కూడా ఈ స్థాయి క్రేజ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని, సినిమా కోసం రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తోన్న అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లుతూ దర్శక, నిర్మాతలు సినిమాను సెప్టెంబర్ 2కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ప్రొడక్షన్ ఇంకా పూర్తి కానందునే టీమ్ సినిమాను వాయిదా వేసింది. ఇక దీంతో ఆగష్టు 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే, నాలుగు రోజుల వీకెండ్ (స్వాతంత్ర్య దినోత్సవం సెలవు దినం కలుపుకొని)తో సూపర్ ఓపెనింగ్స్ వస్తాయని భావించిన అభిమానులకు అనుకున్న తేదీకి సినిమా విడుదల కాకపోవడమన్నది బాగా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 2కు కూడా ఇదే తరహా లాంగ్ వీకెండ్ ఉండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి. సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చవితి కావడంతో, వరుసగా నాలుగు రోజుల వీకెండ్ ఉంటుంది. దీంతో ఆగష్టు 12 లాంటి సూపర్ డేట్ మిస్ అయినా, సెప్టెంబర్ 2 కూడా బాగానే ఉండడంతో, సినిమా వాయిదా పడ్డా ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ అభిమానులు సంతోషంగానే ఉన్నారు.