టాలీవుడ్‌లో గత కొద్దిరోజులుగా యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించిన సినిమా ‘కుమారి 21F’. దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా కావడం, ఆయనే స్వయంగా కథ, కథనాలను కూడా అందించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక విడుదలకు ముందే అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎంటీఆర్ ఇచ్చిన ప్రశంస మరింత ఊపునిస్తోంది.
నిన్న సాయంత్రం ‘కుమారి 21ఎఫ్’ సినిమాను ప్రత్యేకంగా చూసిన ఎన్టీఆర్ సుకుమార్ టీంపై ప్రశంసల జల్లు కురిపించారు. “‘కుమారి 21F’ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశా. దర్శకుడు సూర్య ప్రతాప్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుల పనితనం అద్భుతంగా ఉంది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్‌ల నటన చాలా బాగుంది. ఇక ముఖ్యంగా సుకుమార్ గారి హార్ట్ టచింగ్ స్టోరీ అద్భుతం. ఇలాంటి బోల్డ్ ప్రయత్నానికి హ్యాట్సాఫ్” అంటూ ‘కుమారి’పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.


