తారక్, జక్కన్నల అనుబంధం అలాంటిది మరి..!

Published on Oct 10, 2019 9:11 am IST

దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు నేడు. 1973 అక్టోబర్ 10న కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ లో జన్మించిన రాజమౌళి నేడు 46వ వసంతంలోకి అడిగిడారు. చిత్ర దర్శకుడిగా పరిశ్రమకు రాకముందు రాజమౌళి కొన్ని టీవీ సీరియల్స్ కి దర్శకత్వం వహించారు. ప్రముఖ కథా మరియు స్క్రీన్ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ రాజమౌళి తండ్రి అన్నసంగతి తెలిసిందే. అపజయమెరుగని దర్శకునిగా పేరున్న రాజమౌళి 19ఏళ్ల సినీ ప్రయాణంలో చేసింది కేవలం 11సినిమాలే. ఆర్ ఆర్ ఆర్ ఆయన 12వ చిత్రంగా తెరకెక్కుతుంది.

చిత్ర పరిశ్రమలో రాజమౌళి, ఎన్టీఆర్ లది ప్రత్యేక అనుబంధం. రాజమౌళి మొదటి చిత్రం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నంబర్ వన్ కాగా, ఎన్టీఆర్ తొలి హిట్ మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. రాజమౌళి తన రెండవ చిత్రం కూడా ఎన్టీఆర్ తో చేశారు. రాజమౌళి రెండవ చిత్రం సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా 25కోట్ల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. ఇక చివరిగా వీరిద్దరూ కలిసి రూపొందించిన సోషల్ ఫాంటసీ మూవీ యమదొంగ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం.

2007లో వచ్చిన యమదొంగ చిత్రం తరువాత వీరిద్దరూ దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా కలిశారు. టాలీవుడ్ లో రాజమౌళి చేసిన,చేస్తున్న చిత్రాలలో ఒక్క ఎన్టీఆర్ తోనే నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో ప్రభాస్ మూడు సినిమాలు చేసినవాడిగా ఉన్నారు. ఒకరినొకరు, తారక్, జక్కన్న అని పిలుచుకునే వీరిద్దరూ పరిశ్రమలో అన్నదమ్ముల అనుబంధం కలిగివున్నారు. మరి అలాంటి ఆప్తమిత్రుడికి ఎన్టీఆర్ పుట్టినరోజు బహుమతిగా ఏమిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More