
తెలుగు దర్శకులలో అత్యంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసే దర్శకులలో ముందువరుసలో ఉంటారు పూరి జగన్నాధ్. కొబ్బరికాయ కొట్టిన రోజునే విడుదల తేది ప్రకటించడం పూరి జగన్నాధ్ స్టైల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో పూరి తెరకెక్కించనున్న సినిమా షూటింగ్ కేవలం 100 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈనెలలోనే ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ… ‘బాద్షా వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై నేను నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం అవుతుంది. వక్కంతం వంశీ అద్బుతమైన కథను అందించారు. ఈ సినిమా షూటింగ్ ను కేవలం 100 రోజులలో పూర్తి చేయనున్నాం. పూరి దర్శకత్వం, మాటలు సినిమాకి మెయిన్ హైలైట్. 2015 సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నాం. బృందావనం, బాద్షా తర్వాత కాజల్ అగర్వాల్ మరోసారి ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని అన్నారు.

