
జూనియర్ ఎన్టీఆర్, కె. విశ్వనాథ్.. మరో సాగరసంగమం! ఈ ప్రపోజల్ చూస్తేనే ఏదో మంచి అనుభూతి కలుగుతోంది కదూ? తీసే ప్రతీ సినిమాలోనూ ప్రేక్షకుడిని ఏళ్ళ పాటు కట్టిపడేసే మాయేదో కె. విశ్వనాథ్ సినిమాల్లో కనిపిస్తుంది. ఆయన తీసిన చాలా సినిమాలు క్లాసిక్ సినిమాలుగా నిలిచి ఎప్పటికీ మనం మరచిపోలేనివిగా మిగిలాయంటే అది కళాతపస్వికి సినిమాపై ఉన్న పట్టు, కళపై ఉన్న అభిమానం వల్లనే అనేది నిస్సందేహంగా చెప్పేయొచ్చు. ఆయన తీసిన క్లాసిక్ సినిమాల్లో ‘సాగరసంగమం’ ఒకటి. ఈ సినిమాలో ఓ నృత్య కళాకారుడి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా, హృద్యంగా తెరకెక్కించిన విశ్వనాథ్, కమల్ కెరీర్‌కు గొప్ప మైలురాయిగా ఈ సినిమాను నిలిపారు.
తాజాగా అలాంటి సినిమా కోవలోనే మరో కొత్త సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. డ్యాన్స్ విషయంలో తెలుగు పరిశ్రమలో ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటూ వస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. కె. విశ్వనాథ్, ఎన్టీఆర్ ఎప్పట్నుంచో ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక పూర్తి స్థాయి డ్యాన్స్ ఓరియెంటెడ్ కథను ఎన్టీఆర్‌కు చెప్పగా ఆయన ఈ సినిమాకు సిద్ధమయ్యారని టాక్. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ లాంటి ఓ సూపర్‌స్టార్ ఇలాంటి సినిమాలో నటించడం ప్రయోగమనే చెప్పాలి. ఇవన్నీ నిజమై సినిమా రూపు దిద్దుకుంటే కనుక ఎన్టీఆర్ కెరీర్‌కే కాక, తెలుగు సినీ పరిశ్రమకూ శుభవార్త కిందే లెక్క!

