సమీక్ష : ‘ఊరంతా అనుకుంటున్నారు’ – ‘ఊరంతా అనుకునేంత మ్యాటర్ లేదు !

Published on Oct 6, 2019 3:01 am IST

విడుదల తేదీ : అక్టోబర్ 05, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : నవీన్ విజయ కృష్ణ,శ్రీనివాస్ అవసరాల,మేఘా చౌదరి, సోఫీ సింగ్, జయసుధ,కోట శ్రీనివాస రావు,రావు రమేష్ తదితరులు.

దర్శకత్వం : బాలాజీ సనల

నిర్మాత‌లు : శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల,పి ఎల్ ఎన్ రెడ్డి

సంగీతం : కె ఆర్ రాధాకృష్ణన్

సినిమాటోగ్రఫర్ : జి బాబు

 

నవీన్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్ గా బాలాజీ సనాల దర్శకత్వంలో శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

పచ్చని పైరుతో కళకళలాడుతున్న స్వచ్ఛమైన పల్లెటూరు రామాపురం. అయితే ఈ గ్రామానికి ఓ కట్టుబాటు ఉంటుంది. ఈ పల్లెటూరిలో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఆ ఊరిలోని అందరూ ఆ పెళ్లిని అంగీకరించాలి. అలాంటి ఊరిలో పుట్టిన మహేష్ (నవీన్ విజయకృష్ణ)కి , గౌరి (మేఘ చౌదరి)కి పెళ్లి చేయాలని ఆ ఊరంతా నిర్ణయించుకుంటారు. అయితే అప్పటికే మహేష్ మాయ (సోఫియా సొన్గ్)తో ప్రేమలో పడితే.. గౌరి, శివ రామన్ అయ్యర్ (అవసరాల శ్రీనివాస్ )తో ప్రేమలో పడుతుంది. దాంతో పెద్దలు నిర్ణయించిన పెళ్లిని కాదని.. మహేష్, గౌరి ఇద్దరూ తమ ప్రేమ గురించి పెద్దలకు చెబుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి ? పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ? వీళ్ల ప్రేమ విషయంలో వీరికి పెద్దలు ఎలాంటి పరీక్షలు పెట్టారు ? ఆ పరీక్షల్లో వీళ్లు నెగ్గరా ? లేదా ? ఇంతకీ ఆ గ్రామం పెట్టుకున్న కట్టుబాటుకి కారణం ఏమిటి ? చివరికి మహేష్, గౌరి తమ ప్రేమను గెలుచుకున్నారా ? లేక, వీళ్ళిద్దరే ప్రేమలో పడ్డారా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

బాలాజీ సనాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే పల్లె వాసనను గుర్తు చేసే సీన్స్, అలాగే బంధాలు బంధుత్వాలకి సంబంధించిన కొన్ని అంశాలు సినిమాలో కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ విజయ్ కృష్ణ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తానూ ప్రేమించిన అమ్మాయిలో నిజమైన ప్రేమను వెతుకుంటూ.. చివరికీ తను ప్రేమించాల్సిన అమ్మాయే వేరు అని తెలుసుకునే క్రమంలో వచ్చే సన్నివేశాల్లో నవీన్ చాల బాగా నటించాడు.

 

అలాగే మరో కీలక పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా తమిళ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ పర్వాలేదనిపిస్తారు. అయితే సోఫియా సొన్గ్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక కీలక పాత్రలో నటించిన రావు రమేష్ తన ఎక్స్ ప్రెషన్స్ తో, తన శైలి మాడ్యులేషన్ తో సినిమాలో కనిపించనంత ఆయన అలరిస్తారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు జయసుధ, కోట శ్రీనివాస రావు తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమాలో అక్కడక్కడా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, రావు రమేష్ క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం, ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో ప్లే బాగా బోర్ గా సాగుతూ మొత్తానికి సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమయి సాగవు. పైగా కథనంలో సరైన ప్లో కూడా లేదు. ఇక కొన్ని సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించటానికి చేసినట్లే ఉంటుందిగాని, సహజంగా ఉండదు. ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీసింది.

 

సెకెండ్ హాఫ్ లో కూడా కథనం అసలు బాగాలేదు. క్లైమాక్స్ భాగాన్ని మినహాయిస్తే.. మొత్తం సినిమా ఆకట్టుకోదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు. సినిమాలో స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా చాలా వీక్ గా ఉంది.

 

కథకు బలం పెంచలేని లవ్ అండ్ కామెడీ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ (సైకిల్ పోటీ సన్నివేశం, కొన్ని లవ్ సీన్స్) కూడా లాజిక్ లేకుండా సాగడం.. అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు బాలాజీ దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా పరిపూర్ణంగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో ఏ మాత్రం విషయం లేదు. సంగీత దర్శకుడు కె ఆర్ రాధాకృష్ణన్ అందించిన పాటలు కూడా బాగాలేదు. అయితే ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. జి బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాతలు శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.

 

తీర్పు:

 

‘ఊరంతా అనుకుంటున్నారు’ అంటూ హ్యూమన్‌ రిలేషన్స్‌ కు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో సాగిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు సంఘర్షణ లేని ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

X
More