సెన్సార్ తీరుపై పీసీ శ్రీరామ్ అసంతృప్తి!

సెన్సార్ తీరుపై పీసీ శ్రీరామ్ అసంతృప్తి!

Published on Apr 11, 2015 3:37 AM IST

P-C-Sreeram
దర్శకుడు మణిరత్నం ఎంతో శ్రద్ధగా తెరకెక్కించిన అందమైన ప్రేమకథ ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం). గత కొంతకాలంగా తన మార్క్ సినిమాని తీయలేకపోయిన మణిరత్నం ఈ సారి మాత్రం అభిమానులను నిరాశపరచడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అంటున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు.

కాగా ఇలాంటి ఒక అందమైన ప్రేమకథకు ‘యూ/ఏ’ ఎందుకివ్వాల్సి వచ్చిందో అర్థం కావట్లేదని మణిరత్నం సినిమాలకు ప్రధాన బలంగా చెప్పబడే సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ అన్నారు. ఒక అందమైన ప్రేమకథకు ‘యూ’ కాకుండా ‘యూ/ఏ’ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. అయితే ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం) సినిమా సహజీవనం అనే అంశంతో ముడిపడి ఉన్నందున సినిమాకు యూ/ఏ ఇవ్వాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ నెల 17న తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు