విడుదల తేదీ : ఆగస్టు 14, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి, ఆశిక్ రెడ్డి తదితరులు
దర్శకత్వం : ఉదయ్ చౌహన్
సంగీతం : పవన్ సి హెచ్
నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని
ఛాయాగ్రహణం : వినోద్ కే బండారి
కూర్పు : సృజన అడుసుమిల్లి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో అలరించేందుకు వచ్చిన పలు చిత్రాల్లో ఓ చిన్న చిత్రం ‘పళ్ళ బురుసు’ కూడా ఒకటి. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో మురళీ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తెలంగాణలోని చిన్న కుగ్రామంకి చెందిన శంబో (సుధాకర్ రెడ్డి) తనకి పంటి నొప్పి ఉండడంతో తనకి ఓ మంచి పళ్ళ బురుసు (పంటి బ్రష్) వాడమని డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) కి ఆ పళ్ళ బురుసు, మందులు కొనమని చెప్తాడు. కానీ ఈ పంచాయితీ మరో రీతిలోకి వెళ్లేలా పరిస్థితులు మారుతాయి. దీనితో తన కొడుకు తనకి పళ్ళ బురుసు కొనివ్వలేదు, ఇంకా మరికొన్ని కారణాలు చెప్పి కేసు వేస్తాడు శంబో. ఇంకోపక్క తన తండ్రి పేరిట ఉన్న ఎకరా పొలాన్ని అమ్మి తన అప్పులు తీర్చుకోవాలని తిరుపతి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరు తండ్రీ కొడుకులు తగాదాలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు? అసలు శంబో కేసు వేసింది కేవలం చిన్నపాటి పంటి బ్రష్ కొనివ్వలేదు అనేనా? లేక మరో కారణం ఉందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఒక వయసు వచ్చాక ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తారో అనే పాయింట్ ని దర్శకుడు డీసెంట్ ఎమోషన్స్ తో ఇందులో ప్రెజెంట్ చేయడం బాగుంది. దీనితో పాటుగా ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగి మనిషికీ మనిషికీ పెరుగుతున్న దూరాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం జరుగింది. ఇది కూడా పర్వాలేదు అనిపిస్తుంది.
ఇక తమ పాత్రల్లో బలగం నటుడు సుధాకర్ రెడ్డి తన పాత్రలో మరోసారి షైన్ అయ్యారు. బలగం తర్వాత మళ్లీ అదే తరహా తండ్రి పాత్రలో కొడుకు నుంచి ఇంత ప్రేమని ఆశించే విలవిలలాడే తండ్రిగా చాలా బాగా చేసారు. అలానే తన కొడుకు పాత్రలో మురళీధర్ గౌడ్ కూడా బాగా చేసారు. తన తండ్రి విషయంలో కఠినంగా ఉండే కొడుకుగా తర్వాత తనేం కోల్పోయాడు అనే భావోద్వేగాలతో తన నటన ఇందులో మెప్పిస్తుంది.
వీరితో పాటుగా శంబో ఫ్రెండ్స్ బ్యాచ్, వారిపై కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా వీరందరి నడుమ ఓ ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఇక తమతో పాటుగా యువ నటీనటులు ప్రజ్వల్, గోమతి రెడ్డి ఇద్దరూ మంచి కెమిస్ట్రీ కనబరిచారు. వీరిపై కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక ఈ అందరితో పాటుగా ఇతర నటీనటులు అంతా బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో కథనం సినిమా క్లైమాక్స్ కి వస్తుంది అనే ముందు వరకు చాలా ఫ్లాట్ గానే సాగుతుంది. ఆల్రెడీ టచ్ చేసిన సబ్జెక్ట్ లానే ఇదీ ఉండడంతో మరీ అంత కొత్తదనం అనిపించదు. పైగా ఇదే తరహా ఎమోషనల్ కాన్సెప్ట్ లో బలగం, తదితర సినిమాలు చూసాం. సో ఈ చిత్రంలో కొత్తదనం లోపించింది అనిపిస్తుంది.
అంతేకాకుండా కొన్ని సీన్స్ ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. ఇద్దరు తండ్రి కొడుకుల నడుమ ఘర్షణ ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే కథనంలో మరింత వెయిట్ పెరిగేది. ఇంకా ఫస్టాఫ్ కూడా ఏమంత ఎంగేజింగ్ గా సాగలేదు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నాచురల్ సెటప్ తో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో బాగా చిత్రీకరించారు. పవన్ సి హెచ్ సంగీతం బాగుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ సాంగ్ కి మంచి సాహిత్యం రాబట్టారు. వినోద్ కే బంగారి కెమెరా వర్క్ బాగుంది. సృజన ఎడిటింగ్ కూడా ఓకే.
ఇక దర్శకుడు ఉదయ్ చౌహన్ విషయానికి వస్తే.. తన వర్క్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్ లో తను ప్లాన్ చేసుకున్న ఎమోషనల్ పార్ట్ బాగా వర్కవుట్ అయ్యింది. కానీ ఫస్టాఫ్ ని సోసోగానే నడిపించారు. పైగా ఇది బలగం కి మరో వెర్షన్ లా ఇతర కొన్ని అంశాలతో రొటీన్ గా నడిపారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘పళ్ళ బురుసు’ కేవలం కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే మెప్పిస్తుంది. కోర్ లైన్, ఇతర కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గానే ఉన్నాయి. పైగా ఫస్టాఫ్ కథనం వీక్ గా సాగింది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో కథనం ఇలా ఉంటే బాగుండేది. సో వీటితో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
