
రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్నాడు హీరో రామ్. ఈ క్రమంలోనే ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో ‘పండగ చేస్కో’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూసిన వారంతా రామ్ ఈ సినిమాలో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడని, రామ్ కెరీర్‌కు మళ్ళీ మంచి బూస్ట్ ఇచ్చే సినిమాగా ‘పండగ చేస్కో’ నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ డ్యాన్సులు, ఎనర్జిటిక్ డైలాగులు, రకుల్ ప్రీత్ సింగ్‌తో గల సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకునే అంశాలు కాగా, బ్రహ్మనందం ఫినిషింగ్ టచ్ ట్రైలర్‌కే హైలైట్. ట్రైలర్‌తోనే ఇంత కామెడీని పండించగా ఇక సినిమాలో ఇంకెంత కామెడీ ఉండగలదో ఊహించుకోవచ్చనే టాక్ వినబడుతోంది.
రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా సాటిలైట్ హక్కులు బంపర్ ధరకు అమ్ముడుపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌తో పండగ చేస్కో ఈ అంచనాలను అందుకుందనే చెప్పాలి. మరి సినిమా కూడా ఆ అంచనాలను అందుకుంటుందా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక మే నెల్లోనే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
‘పండగ చేస్కో’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

