నూతన నటుడు పవన్ మహావీర్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై జి. శైలజ రెడ్డి నిర్మించిన ఈ ప్రణయ చిత్రానికి శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నటుడు సుమన్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
లండన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న పవన్ మహావీర్కు ఇది తొలి చిత్రమని సుమన్ తెలిపారు. మూవీ టీమ్ అంతా సమష్టిగా శ్రమించి ఈ ప్రాజెక్ట్ను ఎంతో చక్కగా రూపుదిద్దిందని ఆయన వెల్లడించారు. తొలి యత్నంలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతిభ చాటారని కొనియాడారు.
ఈ చిత్రంలో వర్షిక, సుహానా కథానాయికలుగా నటించగా.. రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మహేందర్.ఎం ఛాయాగ్రహణం, నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 7న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్మాతలు తెలిపారు.
