సమీక్ష : పిచ్చెకిస్తా – మెసేజ్ ముసుగులో మరో బూతు సినిమా.

సమీక్ష : పిచ్చెకిస్తా – మెసేజ్ ముసుగులో మరో బూతు సినిమా.

Published on Oct 18, 2014 5:20 PM IST
Pichekkistha విడుదల తేదీ : 18 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం శ్రీకాంత్ రెడ్డి
నిర్మాత : నటరాజ్, రాజశేఖర్ లంకా, శ్రీకాంత్ రెడ్డి
సంగీతం : నవనీత్ చారి
నటీనటులు : ఎన్.కె., హరిణి, శ్రీకాంత్ రెడ్డి…

‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘3జి లవ్’ సినిమాల స్ఫూర్తితో చాలా మంది యువ ఔత్సాహిక దర్శకులు అటువంటి సినిమాలను తీశారు. అందులో కొందరు మాత్రమే విజయవంతం అయ్యారు. అదే కోవలో తెరకెక్కిన మరో సినిమా ‘పిచ్చేకిస్తా’. మిర్రర్ మీడియా సమర్పణలో 7 ఆర్ట్స్ – మానస ఫిల్మ్స్ పతాకంపై నటరాజ్, రాజశేఖర్ లంకా, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నేడు, అక్టోబర్ 18న విడుదలైంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం..!

కథ :

చారి (ఎన్.కె.) ఓ అమాయక కుర్రాడు. చారికి ఉన్న చెడు అలవాటు ఏంటంటే డబ్బు అవసరమైనప్పుడు బైకులు దొంగతనం చేస్తాడు. పక్కనే ఉన్న గర్ల్స్ హాస్టల్ లో ఉండే అలివేణు (హరిణి) ని చూసి ప్రేమలో పడతాడు. చారి అమాయకత్వం చూసిన అలివేణు అతన్ని ప్రేమిస్తుంది. సిటీలో అమ్మాయిలకు తన కారులో లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి మానభంగం చేసే సైకో(శ్రీకాంత్) వలలో అలివేణు చిక్కుకుంటుంది. సైకోపై పోలీసులకు పలు అజ్ఞాత వ్యక్తుల నుండి కంప్లైంట్స్ వస్తుంటాయి. అతను ఎలా ఉంటాడో తెలియకపోవడంతో అరెస్ట్ చేయడం కష్టం అవుతుంది.

చారిని ప్రేమించిన అలివేణు సైకోతో ఎందుకు సన్నిహితంగా తిరుగుతుంది..? సైకో అలివేణును ఏం చేశాడు..? సైకో బారి నుండి తప్పించుకోవడానికి చారి – అలివేణులు కలిసి ఏమన్నా ప్లాన్స్ వేసారా .? పోలీసులు సైకోను పట్టుకున్నారా..? లేదా..? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

హీరో హీరోయిన్లు క్యారేక్టరైజేషన్, వారి నటన ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. అమాయకుడైన కుర్రాడి పాత్రలో ఎన్.కె. నటన బాగుంది. అతని హావభావాలు ఎక్కడా ఓవర్ అనిపించలేదు. చాలా సహజంగా నటించాడు. హీరో క్యారెక్టర్ తో అమీర్ పేట్ హాస్టల్స్ లో ఉండే కుర్రాళ్ళు కనెక్ట్ అవుతారు. గ్లామర్ పరంగా బి, సి సెంటర్ ప్రేక్షకులను అందాల విందు భోజనం వడ్డించింది హీరోయిన్ హరిణి. పలు సన్నివేశాలలో ఎక్పోజింగ్ ని వల్గర్ గా లేకుండా వయ్యారంగా చూపించింది. నటన కంటే అందాలను చూపించడానికి ఎక్కువ శ్రద్ధ వహించింది. పాత్రకు తగ్గట్టు నటించింది. మెయిన్ లీడ్ తర్వాత సినిమాలో సంగీతం పర్వాలేదనిపించింది. ‘ఒక్క క్షణం నీ కళ్ళు…’ పాట మెలోడియస్ గా బాగుంది. చాలా శృంగారభరితంగా ఆ పాటను చిత్రీకరించారు. పాటలో కొంచం సెక్సీ అప్పీల్ ఎక్కువ అయింది.

మైనస్ పాయింట్స్ :

పలు సినిమాలలో సన్నివేశాలను కాపీ చేసి దర్శకుడు ఈ సినిమా కథ రాసుకున్నాడు. సినిమాకు అదే ప్రధాన అడ్డంకిగా నిలిచింది. దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం, సన్నివేశాల చిత్రీకరణలో కొంచం కూడా కొత్తదనం లేదు. ముఖ్యంగా ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. సినిమాకి కీలకమైన సైకో పాత్ర చేసిన శ్రీ కాంత్ పాత్ర ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. అలాగే పెర్ఫార్మన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ‘రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమాలో అమ్మాయిలను మోసం చేసి మానభంగం చేసే క్యారెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకుని విలన్ ట్రాక్ రాసుకున్నారు. అతను అమ్మాయిలను మానభంగం చేసే సైకోగా ఎందుకు మారాడు అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే పోలీస్ స్టేషన్ సన్నివేశాల వలన ఉపయోగం కూడా లేదు.

‘వెళిపోతుంది.. వెళిపోతుంది.. ‘ పాటను అయితే మక్కికి మక్కిగా ‘ఈ రోజుల్లో’ సినిమా నుండి కాపీ కొట్టారు. ఆ సినిమాలో డాన్సర్లు హీరోల మాస్క్ వేసుకుంటే, ఈ సినిమాలో హీరోయిన్ల మాస్క్ వేసుకున్నారు అంతే తేడా. ఇలా ప్రతి సన్నివేశం ఏదో ఒక సినిమాను తలపిస్తుంది. కాపీ సన్నివేశాలను అయినా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, చక్కని నటనతో ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాను రూపొందించవచ్చు. కానీ అది కుదరలేదు. హీరో స్నేహితులగా నటించిన వారు ఓవర్ ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ ఘోరంగా నటించడంతో చూసే వారికి చిరాకు వస్తుంది. భూతు లేదా శృంగారం అనేది ఉండాలి కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి, మోతాదుకి మించి ఉంటే విసుగొస్తుంది. అదే ఈ సినిమాలోనూ జరిగింది. ఇలాంటి చిన్న లాజిక్ ని డైరెక్టర్ ఎలా మిస్ అయ్యాడో..

సాంకేతిక విభాగం :

టెక్నికల్ విభాగంలో సంగీత దర్శకుడు నవనీత్ చారి ఒక్కడే బెటర్ అనిపించాడు. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా బాగుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా నాసిరకంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రాము జి కెమెరా వర్క్ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్ కి చాలా తక్కువ అన్నట్లు ఉంది. ఇక ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ మిగతా టెక్నీషియన్లు అందరూ అతన్ని ఫాలో అయిపోయారు. బహుశా బడ్జెట్ పరిమితుల వలన వాళ్ళ ప్రతిభను పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం దొరకలేదేమో.
కథ, స్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణ భాద్యతలను నిర్వర్తించిన శ్రీకాంత్ సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో నటించాడు. చాలా విభాగాలను హ్యాండిల్ చేయడం వలన ఒక్క విభాగంలో కూడా సరైన పనితీరును కనబరచలేదు. ఈ సినిమా కంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ లో డైరెక్షన్, షాట్ కంపోజిషన్, సీన్ మేకింగ్ వంటి అంశాలు 100 రెట్లు బాగుంటాయి. శ్రీకాంత్ రెడ్డి రాసిన హీరో హీరోయిన్లు క్యారేక్టరైజేషన్, సంగీతం మినహా సినిమాలో మరో అంశం బాగుంది అని చెప్పడానికి లేదు. అడల్ట్ కామెడీ, హీరోయిన్ అందాలు సినిమాను గట్టేక్కిస్తాయి అనుకోవడం పొరపాటు. భూతును కూడా అందంగా చెప్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాలో చూపించాల్సిన భూతు అంతా చూపించి చివరలో ఒక మెసేజ్ ఇవ్వడం గొప్ప అని దర్శకుడు భావించినట్టు ఉన్నాడు. ఇటువంటి సినిమాలకు కాలం చెల్లిందని తెలుసుకుంటే మంచిది.

తీర్పు :

‘పిచ్చేకిస్తా’ ఎటువంటి సినిమానో ట్రైలర్, పబ్లిసిటీ కోసం విడుదల చేసిన హీరోయిన్ స్టిల్స్ లోనే దర్శక, నిర్మాతలు హింట్ ఇచ్చారు. ట్రైలర్, హీరోయిన్ స్టిల్స్ చూసి ఈ సినిమా అంతా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, నాకు అది కావాలి అని ఆశించి థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. మిగతా వారికి మాత్రం రోత పుట్టిస్తుంది. మెసేజ్ పేరుతో రెండు గంటల పాటు బూతు కామెడీ తెరకెక్కించారు. కేవలం బి, సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తీసిన సినిమా ఇది. సినిమాగా కాకుండా అడల్ట్ కామెడీ, హీరోయిన్ అందాలను ఎంజాయ్ చేసేవారు సినిమాకు వెళ్ళొచ్చు. పక్కా ‘ఏ’ రేటెడ్ సినిమా ఇది. పెద్దలకు మాత్రమే.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు