
మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న హీరో సాయి ధరమ్ తేజ్. తను హీరోగా చేసిన మొదటి సినిమా ‘రేయ్’ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది రిలీజ్ కాక ముందే తను హీరోగా నటించిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ సీన్స్ తప్ప మిగతా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ఈ చిత్ర టీం ప్రారంభించింది. సాయి ధరమ్ తేజ్, జగపతి బాబుల డబ్బింగ్ తో పాటు మిగతా నటీనటుల డబ్బింగ్ పనులు కూడా దాదాపు చివరి దశలో ఉన్నాయి. దీంతో ఈ చిత్ర టీం ఆగష్టులో మిగిలిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియోని ఆగష్టు లేదా సెప్టెంబర్ మొదట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

