మెగా కాంపౌండ్ నుంచి తెలగు తెరకు పరిచయమైన హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాలు ‘రేయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఈ రెండు సినిమాల్లో సాయి ధరమ్ తేజ్ ని తెలుగు తెరకు, ప్రేక్షకులకు పరిచయం చేసిన మొదటి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి అటు విమర్శకుల నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
సాయి ధరమ్ తేజ్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ మెగా కాంపౌండ్ అనే బ్రాండ్ ఉండడం వల్ల బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా నైజాంలో మొదటి షో నుంచి కలెక్షన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మొదటి రోజు 80 లక్షల షేర్ వస్తే, రెండవ రోజు 57 లక్షల షేర్ సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్న సమాచారం ప్రకారం పిల్లా నువ్వులేని జీవితం మొదటి వారం చివరి కల్లా 3 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. మొదటి సినిమాతో సాయి ధరమ్ తేజ్ బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామినాని నిరూపించుకుంటున్నాడు.
నటీనటుల పెర్ఫార్మన్స్ తో పాటు కంటిన్యూగా కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ – రెజీన జంటగా నటించిన ఈ సినిమాకి ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్టర్.


