
నందమూరి బాలకృష్ణ మరోసారి రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. నిన్నటితో ఈ చిత్ర టీం ఢిల్లీ షెడ్యూల్ ని పూర్తి చేసుకోవడమే కాకుండా టాకీ పార్ట్ ని కూడా ఫినిష్ చేసారు. ఇంకా కొన్ని సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. దాదాపు నెల రోజుల క్రితమే బాలయ్య డిక్టేటర్ సినిమా ఆడియోని డిసెంబర్ 20న రిలీజ్ చెయ్యాలని, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి నిర్ణయించాడు. అమరావతిలో జరుగుతున్నా మొట్ట మొదటి సినీ వేడుక కావున దీనిని అత్యంత వైభవంగా చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేసాడు. అనుకున్నట్టుగానే బాలయ్య ఈ వేడుకకి భారీ వేదికని సిద్దం చేయిస్తున్నాడు.
బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రమోట్ చేస్తూ భారీ ఎత్తున చేస్తున్న ఈ వేడుకకి తన వంతు సాయం అందించి, వేడుకని మరింత జయప్రదం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా రావడానికి తన అంగీకారాన్ని తెలిపాడు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా టిడిపి పార్టీలోని పలువురు రాజకీయ దిగ్గజాలు కూడా ఈ వేడుకకి హాజరుకానున్నారు. వీరితో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు మరియు డిక్టేటర్ చిత్ర టీం కూడా హాజరు కానుంది. తెలుగు చలన చిత్ర సీమలో కనీ వినీ ఎరుగని రీతిలో చేయనున్న ఈ ఆడియో ఫంక్షన్ ని లక్ష మంది అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

