
కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తన ఇన్నేళ్ళ సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలతో, కథాంశాలతో మనల్ని మెప్పించి దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకరుగా నిలిచారు. సినిమా కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడని తత్వం కమల్ హాసన్‌ది. గతంలో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విశ్వరూపం’ సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి విజయం సాధించారు. తాజాగా ఆయన నిర్మించిన ‘ఉత్తమ విలన్’ కూడా ఇదే తరహా వివాదాల్లో చిక్కుకుంది. చివరకు ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమౌతోంది.
ఇదిలా ఉంటే.. ఇలాంటి ఎన్ని ఇబ్బందులొచ్చినా తాను అనుకున్నది చేసి తీరతానని అంటున్నారు కమల్. మరో వివాదాస్పద కథతో ఓ సినిమా తెరకెక్కించనున్న విషయాన్ని ప్రకటించారు. 1968లో తమిళనాడులోని ఓ గ్రామంలో ఓ భూస్వామి చేతిలో హతమైన 44 మంది దళితుల కథగా కమల్ కొత్త సినిమాను తీయనున్నారు. ఈ యదార్థ ఘటనను తలుచుకున్నప్పుడల్లా బాధగా ఉంటుందని, సమాజంలో కులాల ఆధిపత్యమనేది ఉండకూడదనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నానని కమల్ తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సినిమాను మొదలుపెడతామని కమల్ అన్నారు. ఈ సినిమా కోసం జైలుకు వెళ్ళాల్సి వస్తే.. దానిక్కూడా తాను సిద్ధమని కమల్ ప్రకటించడం విశేషం.

