ఇంటర్వ్యూ : ప్ర‌భాస్ – ‘సాహో’ అంతర్జాతీయ స్థాయిలో సాగే యాక్షన్ డ్రామా !

Published on Aug 26, 2019 9:30 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. కాగా అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. కాగా ఈ సందర్భంగా ప్ర‌భాస్ మీడియాతో మాట్లాడారు. మరి సినిమా గురించి ప్ర‌భాస్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు ప్ర‌భాస్ మాటల్లోనే..

 

సాహో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు ?

సాహో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కదా. అందుకే ప్రమోషన్స్ ను కూడా అన్ని భాషల్లో భారీ ఎత్తున చేస్తున్నాం.

 

‘బాహుబలి’ తర్వాత మీలో కొత్తగా ఏమైనా మార్పులు గమనించ వచ్చా ?

‘బాహుబలి’ తర్వాత నాలో కొత్తగా వచ్చిన మార్పులు అయితే ఏమిలేవు. కాకపోతే బాహుబలి సిరీస్ నాకు నటుడిగా ఇండియా వైజ్ గా కొంత ఐడెంటిటీ తీసుకొచ్చింది.

 

‘బాహుబలి 2’కి వచ్చిన క్రేజ్ కంటే కూడా, సాహోకి మిగిలిన భాషల్లో కూడా చాల మంచి క్రేజ్ వచ్చింది. దాన్ని ఆస్వాదిస్తున్నారా ?

బాహుబలి కారణంగా సాహోకి అన్ని భాషల్లో కూడా క్రేజీ ప్రాజెక్ట్‌ గా మారింది, కానీ ఈ రెండు వేర్వేరు సినిమాలు, వేరు వేరు జోనర్లు.. వాటిని పోల్చలేము. అందుకే మేము ఎప్పుడూ బాహుబలిని మరియు సాహోలను పోల్చి చూడలేదు.

 

సాహోని పూర్తి చేయడానికి ఎందుకు ఎక్కువ టైం తీసుకున్నారు ?

కావాలని ఎక్కువ టైం తీసుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో సాహోని ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాము. కాబట్టి, హాలీవుడ్ నుండి చాలా మంది సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేశారు. అలాగే ప్రతి సన్నివేశానికి మేం చాలా రోజులు రిహార్సల్స్ చేశాము. ఆ పై ప్లానింగ్, ప్రొడక్టెన్ డిజైన్ వర్క్స్ మరింత ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అన్ని విషయాల్లో చాల జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాము. కానీ ఆ తరువాత వి.ఎఫ్.ఎక్స్ వల్ల కొంత ఆలస్యం అయింది.

 

ప్రభాస్‌ తో సినిమా అంటే కనీసం రూ. 100 కోట్లు బడ్జెట్. ‘జాన్’ సినిమాని కూడా భారీ బడ్జెట్ చిత్రంగా చెబుతున్నారు. ఆ చిత్రం అవుట్ ఫుట్ ఎలా వస్తోంది ?

సినిమా బడ్జెట్ ఎప్పుడైనా ఆ సినిమా కథకు అనుగుణంగా ఖర్చు పెట్టాలని నేను నమ్ముతాను. అయినా, నా సినిమాకి ఎప్పుడూ భారీ బడ్జెట్ పెట్టమని నేను ఏ నిర్మాత పై ఒత్తిడి చేయలేదు. అయితే సాహోకి ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి కారణం, ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించాలానే లక్ష్యంతో తీశాం. అందుకే భారీ బడ్జెట్ అవసరం అయింది. ఇక జాన్ మూవీ కూడా పెద్ద బడ్జెట్ చిత్రమే. అయితే అది ‘సాహో’ అంత పెద్దది కాదు.

 

ఇండియా స్థాయిలో స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు. ఈ స్టార్ డమ్ ను మీరు ముందే ఊహించారా ?

లేదు, ఊహించలేదు. నేను మొదట సినిమాల్లో హీరోగా వస్తే చాలనుకున్నాను. ఆ తరువాత ‘వర్షం’ సక్సెస్ తో ఓకే, ఒక సక్సెస్ వచ్చింది అనుకున్నాను. కానీ రాజమౌళి ఛత్రపతి సక్సెస్ నాలో ఆత్మవిశ్వాశాన్ని పెంచింది. అప్పట్నుంచీ ఒక్కో చిత్రానికి మెరుగవుతూ వచ్చాను. కానీ ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

 

‘సాహో’ బడ్జెట్ తెలుగు చిత్రాలకన్నా ఏడు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంది. మరి కేవలం ఒక్క సినిమా తీసిన దర్శకుడి పై అంత బడ్జెట్ ఎలా పెట్టగలిగారు ? సుజిత్ ని అంతగా నమ్మటానికి గల కారణాలు ఏమిటి ?

సుజీత్‌ కథ మీద, అతని డైరెక్షన్ స్కిల్స్ మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. అయితే తను మొదట కథ చెప్పినప్పుడు మొదట నమ్మలేదు. కానీ మొదటి షెడ్యూల్ ను తను హ్యాండిల్ చేసిన విధానం, చాలా క్లిష్టమైన సమస్యలను కూడా చాల కూల్ గా హ్యాండిల్ చేశాడు. అప్పుడు తన పని పై మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. నా ఫ్రెండ్స్ ఈ సినిమాని నిర్మించారు.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి. ‘సాహో’ తర్వాత కూడా మీరు హిందీలో నటిస్తారా ?

ఏదైనా కథను బట్టే, అలాంటి కథ వస్తే ప్యాన్ ఇండియా సినిమా చేస్తాను. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ‘సాహో’ రిజల్ట్ ను బట్టే తరువాత సినిమాలు గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం జాన్ మూవీ జరుగుతుంది.

సంబంధిత సమాచారం :