
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక గ్రాఫికల్ మానియా ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం 2 పాటల సాంగ్ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బాలన్స్ ఉన్నాయని ఇది వరకే తెలియజేశాం. గత నెల రోజులుగా ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం నేటి నుండి ఫస్ట్ పార్ట్ లో బాలన్స్ ఉన్న రెండు పాటల షూటింగ్ ని మొదలు పెట్టింది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో మొదటి పాట షూటింగ్ ని మొదలు పెట్టారు. ఈ పాటని ప్రభాస్ – తమన్నాలపై షూట్ చేస్తున్నారు. ఈ రెండు పాటల షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ఫినిష్ చేసి సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో, భారీ సెట్స్ మరియు మతిభ్రమించే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇండియా, హాంక్ కాంగ్, యుఎస్ కి చెందిన 6 విఎఫ్ఎక్స్ టీమ్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.