ప్రేమమ్’ కలెక్షన్స్ : సోలో హీరోగా చైతూ రికార్డ్!

14th, October 2016 - 03:00:13 PM

premam
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్‌కి రీమేక్ కావడంతో, నాగ చైతన్య కెరీర్‌కు ఈ సినిమా అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందన్న ప్రచారం వినిపించింది. ఇక ఈ స్థాయి అంచనాల మధ్యనే గతవారం విడుదలైన సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. వారం రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 12.6 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

నాగ చైతన్య కెరీర్‌కే సోలో హీరోగా రికార్డ్ ఓపెనింగ్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. దసరా సీజన్‌ను నమ్ముకొని నాలుగు సినిమాలతో కలిసి పోటీలో వచ్చిన ప్రేమమ్, ఆ పోటీలో నిలబడి ఈ స్థాయి వసూళ్ళు రాబట్టడం విశేషమే! ఇక ఈవారం కూడా సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.