‘ప్రేమమ్’ విడుదల తేదీ ఖరారు!

Premam-m
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దసరా సీజన్‌కు సినిమా విడుదలవుతుందంటూ కొద్దిరోజుల క్రితం తెలిపిన టీమ్, తాజాగా విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. దసరా వారమైన అక్టోబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రేమమ్ దర్శక, నిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్ టీజర్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తిస్తూన్నాయి. ముఖ్యంగా ఎవరే పాట అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ‘కార్తికేయ’తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 20న పెద్ద ఎత్తున ఆడియో ఆవిష్కరణ వేడుకను చేపట్టనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 8న బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగే రెండో పాటను విడుదల చేయనున్నారు.