రామ్ సినిమాలో యువహీరో కీరోల్!

రామ్ సినిమాలో యువహీరో కీరోల్!

Published on Dec 7, 2015 9:55 PM IST

prince
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘నేను శైలజ’ పేరుతో ఓ క్యూట్ లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. తన గత చిత్రం ‘శివమ్’ అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో రామ్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకొని రూపొందినట్లు తెలుస్తోంది. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ కెరీర్లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫస్ట్‌లుక్‌గా ‘నేను శైలజ’ ఫస్ట్‌లుక్ పేరు సంపాదించుకుంది.

ఇక ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఓ కథనం మరింత ఆసక్తి కలిగిస్తోంది. బస్‌స్టాప్, సూపర్ స్టార్ కిడ్నాప్ తదితర సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ ఈ సినిమాలో హీరోయిన్ అన్నగా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. ఇక కీర్తి సురేష్‌కు అన్న పాత్రకు సినిమాలో మంచి ప్రాధ్యాన్యం ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ప్రిన్స్‌ను ఈ రోల్‌కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

తాజా వార్తలు