ఇంటర్వ్యూ : సి.కళ్యాణ్ – కొత్త నిర్మాతలు లేకపోతే ఇండస్ట్రీనే లేదు !

Published on Dec 8, 2019 6:12 pm IST

ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ 60వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

ఇప్పటి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది ?

అందరికీ తెలిసిందే కదా. చిరంజీవిగారికి చెప్పాను. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలి.. దాసరి నారాయణగారి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చెయ్యాలనే విషయం పై మాట్లాడను. కానీ ఇప్పటి పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఏమైనా పాతరోజులకు ఇప్పటి రోజులకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగింది. అందుకే కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాము. అందులో చిన్న సినిమా థియేటర్స్ పరిస్థితి కూడా ఉంది.

 

చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు అని ఎన్నో సంవత్సరాల నుండి వినిపిస్తోంది. ఆ సమస్య తీరే అవకాశం ఉందా ?

మొన్న శుక్రవారం ఆరు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. మరి ఆ చిన్న సినిమాలు కూడా లేకపోతే థియేటర్స్ కి డబ్బులు ఎలా వస్తాయి ? ఆ థియేటర్స్ ని నమ్ముకున్న ఎంతోమంది కార్మికుల పరిస్థితి ఏమిటి ? అసలు సినిమా ఇండస్ట్రీకి డబ్బు ఎక్కడి నుండి వస్తోంది. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఆడేవి చాల తక్కువే. కొత్త నిర్మాతలు, చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీనే లేదు.

 

కౌన్సల్ లో చాల గొడవలు అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏమిటి కౌన్సల్ సమస్యలు ?

గిల్డ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. దాని వల్ల ఉపయోగం లేదు. అందుకే కౌన్సల్ లో 70% మంది రెగ్యులర్ గా సినిమాలు చేసేవాళ్ళే ఉండాలని రూల్ పెట్టాలి. అప్పుడే సినిమా నిర్మాణ విషయంలో ఒక పద్దతి ఉంటుంది.

 

మన సినిమాలకు అంతర్జాతీయ అవార్డ్స్ రాకపోవడానికి కారణం?

మన సినిమాలు అక్కడ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. మనకు హోలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ లేకపోవడం కూడా ఒక కారణం. మనకంటే పెద్ద నేషన్ అయిన చైనా సినిమాలు సైతం అంతర్జాతీయ వేదికల పై కనిపించడం లేదు. కొరియా, అమెరికా చిత్రాలు ముఖ్యంగా అర్హత పొందుతున్నాయి. అక్కడ కొందరు ప్రత్యేకంగా ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

 

మనం ఎందుకు ఆ స్థాయికి ఎదగలేకపోతున్నాం?

ఐక్యత లేకపోవడం, ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్చుకునే తత్త్వం లేకపోవడం కారణం అని చెప్పొచ్చు. ఒక హీరోకి నంది అవార్డు వచ్చిందని తెలిసినటప్పుడు ఆ హీరో మినహా మిగతా హీరోలెవరు ఆ కార్యక్రమానికి హాజరుకారు.

 

ప్రస్తుతం సమాజంలో జరిగే అవాంఛనీయ సంఘటనలకు సినిమా కూడా ఒక కారణం అంటున్నారు?

దానిని నేను అంగీకరించను. ఒక చెడ్డ సినిమా చూసి చెడిపోయినోడికి, ఒక మంచి సినిమా చూపించినంత మాత్రాన బుద్ధిమంతుడిలా మారిపోతాడా? సినిమాలో కంటే బయట ఆడపిల్లల వస్త్ర ధారణ దారుణంగా ఉంటుంది. మొబైల్ లో యువత ఏమి చూస్తున్నారో, ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు.

 

మరి దీనికి పరిష్కారం ఏమిటంటారు?

తల్లిదండ్రులు పిల్లల చర్యల పై దృష్టి పెట్టాలి. సంపాదన, ఉద్యోగమే కాకుండా పిల్లలు ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది, వారు ఎటువైపు వెళ్తున్నారు గమనించి అదుపులో పెట్టాలి.

 

ప్రస్తుతం మీ నిర్మాణంలో వస్తోన్న రూలర్ గురించి చెప్పండి ?

‘రూలర్’ సినిమా సువర్ హిట్ అవ్వబోతుంది. బాలయ్య అభిమానులకు అలాగే అన్ని వర్గాల ప్రేక్షుకులకు పెద్ద పండుగ లాంటి సినిమా.

సంబంధిత సమాచారం :

More