
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన తాజా సినిమా ‘శ్రీమంతుడు’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇక విడుదలకు పది రోజులు ఉందన్నప్పట్నుంచే జోరుగా సాగిస్తూ వస్తోన్న ప్రచార కార్యక్రమాలు సినిమాకు బాగా కలిసివచ్చాయి. ఇండస్ట్రీ, సోషల్ మీడియా నుంచి ఈ సినిమాపై అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ మొదలైంది.
మహేష్ స్వయంగా ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రమోషన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా అభిమానులు సైతం సోషల్ మీడియాతో, ఇతరత్రా ప్లాట్ఫాంమ్లలో క్రేజీ ప్రమోషన్స్ చేపట్టారు. ఈ తరహా ప్రమోషన్లు సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించేలా చేశాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో ఇప్పటికే హైలైట్ కాగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

